తెలంగాణలో బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావించి.. బీసీ కుల గణన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేయాలంటే జనాభా లెక్కలు చేయాలని.. అలా అయితే కౌంట్ దొరుకుతుందని చెప్పారు. త్వరలోనే బీసీ కులగణన చేయనున్నట్టు ఇటీవలే మహేష్ కుమార్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే తనకు కేవలం బీసీలు మాత్రమే ఓట్లు వేయాలని రెడ్డిలు ఓసీలు తనకు ఓటు వేయకూడదని సంచలన వ్యాఖ్యలు చేశాడు తీన్మార్ మల్లన్న. అలాగే తనకు పార్టీ పదవులు లెక్క కాదని అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమ భూకంపం రాబోతుందని పేర్కొన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో బీసీలు ఓట్లు వేయకపోతే ఒక్కరు కూడా గెలవరని తెలంగాణలో చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు అలాగే బీజేపీ నేత ఈటెల బీసీల కోసం స్టేట్మెంట్ ఇవ్వలేరని గుర్తు చేశారు. దీంతోపాటు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలదేనని 2028లో బీసీ అభ్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు.