కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి. కాళేశ్వరం సర్వరోగ నివారిణిగా చెబుతూ.. కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుండు. పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచుతామని కేసీఆర్ సర్కార్ హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రాజెక్టు ఎత్తు పెంచి మరో 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలన్న జిల్లా రైతుల డిమాండ్‌ను పాలకులు అసలు పట్టించుకుంటలేరు. అధికార పార్టీ పాలకులు ఎన్నికల టైంలో ప్రాజెక్ట్ పెంపుపై హామీలిచ్చి ఆ తర్వాత మరచిపోవడం పరిపాటిగా మారిందని వెల్లడించారు విజయశాంతి.
వందేండ్ల కింద 2.43 టీఎంసీల కెపాసిటీ ప్రాజెక్టు ద్వారా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల పరిధిలో 10,500 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ప్రాజెక్టుతో పాటు కాల్వల్లో నీటి నిల్వతో సమీప గ్రామాల్లో భూగర్భ నీటి మట్టాలు కూడా బాగా ఉంటాయి. ప్రాజెక్టులో పూడిక చేరడంతో ప్రస్తుతం నీటి నిల్వ కెపాసిటీ 2.43 టీఎంసీల నుంచి 1.8 టీఎంసీలకు పడిపోయింది. మరో వైపు వర్షకాలంలో ప్రాజెక్టుకు భారీగా వచ్చే వరదనీరు వృధాగా పోతోందన్నారు.
ఏటా 2 నుంచి 3 టీఎంసీలకు పైగా నీరు మంజీరాలో కలుస్తోంది. ప్రాజెక్టు ఎత్తు పెంచితే వరద నీరు ఇక్కడ కొంతవరకైనా స్టోరేజీ ఉండే అవకాశం ఉంటుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే ప్రస్తుతం ఉన్న 10,500 ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకూ నీరు అందడంతో పాటు అదనంగా మరో 5 వేల ఎకరాల వరకు ఆయకట్టు పెరిగే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ సర్కార్ అసలు ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. 2014, 2018 ఎన్నికల టైంలో సీఎం కేసీఆర్ కూడా పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచి డెవలప్ చేస్తమని హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేసీఆర్… కమీషన్ వచ్చే ప్రాజెక్టులు తప్ప, ప్రజలకు ఉపయోగపడేవి మాత్రం నీకు పట్టవా? కేసీఆర్ అవినీతి పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడడం ఖాయమని స్పష్టం చేశారు.