తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్…పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. నెక్స్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి, తెలంగాణ గడ్డపై కాషాయా జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే మిషన్ 19 పేరుతో ఎస్సీ స్థానాల్లో పార్టీ బలోపేతం చేసే పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
అంటే రాష్ట్రంలో ఉన్న 19 ఎస్సీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. అదే సమయంలో మిషన్ 12 పేరుతో ఎస్టీ స్థానాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలాగే ఎస్టీ సమన్వయ కమిటీని నియమించి దానికి గరికిపాటి మోహన్ రావుని ఛైర్మన్‌గా పెట్టారు. తాజాగా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల సమీక్షా సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో 12 ఎస్టీ నియోజకవర్గాల్లోనూ బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని, త్వరలోనే ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ.. 12 ఎస్టీ నియోజకవర్గాల్లో పర్యటిస్తుందని బండి చెప్పారు. అయితే ఇక్కడ 12 స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని బండి అంటున్నారు…కానీ మిగిలిన స్థానాల మాదిరిగా ఎస్టీ స్థానాల్లో కమలం గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎస్టీ స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. పైగా మొదట నుంచి గిరిజనులు, ఆదివాసీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. అలాగే ఈ స్థానాల్లో టీఆర్ఎస్ కూడా సత్తా చాటుతుంది.
12 ఎస్టీ స్థానాలు వచ్చి.. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, అశ్వరావుపేట, ఇల్లందు, భద్రాచలం, పినపాక, డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, దేవరకొండ. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. దీంతో భద్రాచలం, ములుగు మాత్రమే కాంగ్రెస్‌కు ఉన్నాయి. మిగిలిన స్థానాలు టీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. కానీ ఈ స్థానాల్లో కాంగ్రెస్ బలం తగ్గలేదు. అటు టీఆర్ఎస్‌కు బలం ఉంది. ఈ రెండు పార్టీలని దాటుకుని ఎస్టీ స్థానాల్లో బీజేపీ సెట్ అవ్వడం అంత ఈజీ కాదు.