శ‌భాష్‌.. పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌డం కోసం స్కూటీనే స్కూల్‌గా మార్చేశాడు..!

-

క‌రోనా వ‌ల్ల ప్ర‌స్తుతం చాలా మంది పిల్ల‌ల‌కు విద్య అంద‌డం లేదు. మారుమూల గ్రామాల్లో విద్యార్థుల‌కు చ‌దువుకునేందుకు స‌రైన స‌దుపాయాలు అందుబాటులో ఉండ‌డం లేదు. అన్నీ ఉన్నా నెట్‌వ‌ర్క్‌, క‌రెంటు.. ఇలా అనేక స‌మ‌స్య‌లు ఉంటున్నాయి. అయితే ఇలా చ‌దువుకు దూర‌మైన విద్యార్థుల కోసం ఆ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచ‌న చేశాడు. త‌న స్కూటీనే చిన్న‌పాటి స్కూల్‌గా మార్చేశాడు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ అనే జిల్లాకు చెందిన చంద్ర శ్రీ‌వాత్స‌వ త‌న స్కూటీని స్కూల్‌గా మార్చేశాడు. దానికి ఒక వైపు గ్రీన్ బోర్డు ఉంటుంది. దానిపై విద్యార్థుల‌కు పాఠాలు చెప్ప‌వ‌చ్చు. ఇంకో వైపు లైబ్ర‌రీ ఉంటుంది. దాంట్లో పిల్ల‌ల‌కు కావ‌ల్సిన పుస్త‌కాలు ఉంటాయి. అలాగే త‌న ఫోన్‌లో వీడియోల‌ను డౌన్‌లోడ్ చేసి పెడ‌తాడు. దీంతో ఏదైనా ఊరికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ఉండే ఏదైనా ఒక చోట లేదా చెట్టు కింద విద్యార్థుల‌కు త‌న స్కూటీ స‌హాయంతో పాఠాలు చెబుతాడు.

అలా అత‌ను రోజూ ఆ జిల్లాలోని అనేక గ్రామాల‌కు తిరుగుతూ విద్యార్థుల‌కు పాఠాలు చెబుతున్నాడు. అనేక గ్రామాల్లో నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య ఉంద‌ని, కొంద‌రు విద్యార్థుల‌కు ఆన్‌లైన్ విద్య కోసం త‌గిన ప‌రిక‌రాలు, ముఖ్యంగా ఫోన్లు, ట్యాబ్‌ల వంటివి లేవ‌ని, అందుక‌నే తానే స్వ‌యంగా ఊరూరూ తిరుగుతూ ఇలా పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతున్నాన‌ని అత‌ను తెలిపాడు. అత‌ని ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version