దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఆ ప్యాకేజీకి అనుగుణంగా డబ్బును రానున్న రోజుల్లో ఎలా ఖర్చు పెట్టేది.. ఆమె వివరించారు. ఎక్కువగా పేద, మధ్య తరగతి వర్గాలు, రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికే ఈ ప్యాకేజీలో పెద్ద పీట వేశారు.
మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిస్తూ.. అన్ని మంత్రిత్వ శాఖలతో చర్చించాకే ఈ ప్యాకేజీని రూపొందించామన్నారు. ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. భారత్ స్వయం సమృద్ధిగా ఎదగడానికి ఈ ప్యాకేజీ అవసరమని అన్నారు. మౌలిక రంగం, టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ తదితర రంగాలకు ఈ ప్యాకేజీ ఊతం ఇస్తుందని తెలిపారు. స్వదేశీ బ్రాండ్లను తయారు చేయడమే ఈ ప్యాకేజీ ఉద్దేశ్యమని అన్నారు.
ఆర్థిక ప్యాకేజీలో భాగంగా చిన్న, మధ్య తరహా కంపెనీలకు రూ.3 లక్షల కోట్ల రుణాలను అందిస్తామని, ఆ రుణాలకు కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతోవారు ఉద్యోగుల వేతనాలు చెల్లించవచ్చని, అలాగే పనులు తిరిగి ప్రారంభించుకునేందుకు కావల్సిన ముడి సరుకు కొనుగోలు చేయవచన్నారు. ఇక ఈ రుణాలకు 4 ఏళ్ల వరకు కాల పరిమితి ఉంటుందని, అలాగే ఏడాది పాటు మారటోరియం సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
విదేశీ కంపెనీలు ఇస్తున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు స్వదేశీ కంపెనీలకు రుణాలను ఇస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మ నిర్భర్ ఇండియా, మేకిన్ ఇండియాకు ఈ ప్యాకేజీ తోడ్పడుతుందని అన్నారు. ఈ ప్యాకేజీ వల్ల దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పునరుజ్జీవనం కలుగుతుందన్నారు. రూ.200 కోట్ల వరకు టెండర్లలో విదేశీ కంపెనీలకు అనుమతి లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు 45 రోజుల్లోగా అన్ని చెల్లింపులు చేస్తామని తెలిపారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఈ-మార్కెట్‌కు అనుసంధానం చేస్తామని మంత్రి సీతారామన్ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ఇకపై బకాయిలు ఉండకుండా చూస్తామని అన్నారు. ఆగస్టు వరకు చిన్న సంస్థలు తమ ఉద్యోగుల కోసం పీఎఫ్ కట్టాల్సిన పనిలేదన్నారు. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తామని తెలిపారు.