కరోనా కారణంగా రేపు (ఆదివారం) జరగాల్సిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కేవలం ఆన్‌లైన్‌లోనే, డిజిటల్ మాధ్యమాల్లో నిర్వహించనున్నారు. ఇక ప్రధాని మోదీ కూడా ఆన్‌లైన్‌లోనే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఆయన యోగా డే, కరోనాను దృష్టిలో ఉంచుకుని దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. 2015 జూన్ 21 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుండగా కేవలం ఈ ఏడాదే ఈ రోజును ఆన్‌లైన్‌లో జరుపుకోనున్నారు.
ఈ సారి యోగా డేను యోగా ఎట్ హోం అండ్ యోగా విత్ ఫ్యామిలీ అనే నినాదంతో నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఇక ఈ డేలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది పాల్గొంటారు. అయితే ఈ సారి ఆన్‌లైన్‌లోనే ఈ డేను నిర్వహిస్తుండడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలూ ఈ సారి ఆన్‌లైన్‌లోనే ఈ డేను జరుపుకోనున్నారు. కాగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కరోనా లేకపోతే లెహ్‌లో భారీ ఎత్తున యోగా డేను నిర్వహించేది. కానీ పరిస్థితులు తారుమారు కావడంతో ఈ సారి ఈ దినోత్సవాన్ని కేవలం ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు.
2014 డిసెంబర్ 11వ తేదీన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయిచింది. ఇందుకు ప్రధాని మోదీ ముందుగా ఆలోచన చేశారు. ఆయన సూచన మేరకు జూన్ 21ని అంతర్జాతీయ యోగా డేగా నిర్ణయించారు. అప్పటి నుంచి యోగా డేను జరుపుకుంటున్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మన దేశంలో ప్రతి ఏటా యోగా డేను నిర్వహిస్తున్నారు.
కోవిడ్ 19 కారణంగా ఈసారి యోగా డే వేడుకలను నిర్వహించడం లేదని, ప్రజలు ఆన్‌లైన్‌లోనే ఇందులో పాల్గొనాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రధాని మోదీ యోగా డే సందర్భంగా దేశ ప్రజలకు సందేశం ఇస్తారు.