Tragedy : కన్నవాళ్ల ఎదుటే కొడుకుల మృతి

-

పిడుగుపడి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పొలం పనుల్లో తండ్రులకు సాయంగా వెళ్లిన కుమారులు వారి ఎదుటే మృత్యు ఒడిలోకి వెళ్లారు. పిడుగుపడి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువరైతు చనిపోయాడు.

కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ గణేశ్.. చిన్న కుమారుడు అజయ్‌(18)తో కలిసి సోమవారం పత్తి చేనులో పురుగుమందు పిచికారీ చేయడానికి వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. సమీపంలోని చెట్టు వద్దకు పరుగెడుతుండగా పిడుగుపడటంతో అజయ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జైనూర్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.


తిర్యాణి మండలం సుంగాపూర్‌లో తండ్రీకొడుకులు బొమ్మన లచ్చయ్య, శ్రీరాములు(18) సోమవారం పత్తి చేనులో కలుపు తీసేందుకు వెళ్లారు. పనిలో ఉండగా సమీపంలో పిడుగు పడటంతో కుమారుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం హస్నాపూర్‌కు చెందిన రైతు రాఠోడ్‌ మనోజ్‌కుమార్‌(32) సోమవారం పొలం పనులు చూసుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో పిడుగుపాటుకు గురయ్యాడు. అక్కడికక్కడే మరణించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version