తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) నేడు జరుగనున్నది. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ జరుగడం ఇది మూడోసారి. పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్-2 రాయడం ద్వారా బీఈడీ అభ్యర్థులు సూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు.
ఈ సారి పేపర్-2 రాసే వారు కూడా పేపర్-1 రాసి, ఎస్టీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్-1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. టెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 212, ములుగులో అతి తకువగా 15 పరీక్ష కేంద్రాలు పెట్టారు. ప్రతి పరీక్ష కేంద్రంలో పటిష్ఠ నిఘా ఏర్పాటుచేశారు. అన్నిచోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీనిని ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. అయితే ఉదయం 9.30గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటల తరువాత పరీక్షా కేంద్రాలలోకి అభ్యర్థులను అనుమతించరని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నునే పరీక్షలో వినియోగించాలని తెలిపారు