ప్రైవేట్ టీచర్ల డేటాతో టీఆర్ఎస్ సర్కార్ కొత్త ప్లాన్

-

కరోనా తో మూతపడి ఆర్దికంగా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్లకు సాయం చేయాలన్నది తెలంగాణ సర్కార్‌ నిర్ణయం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్‌లో పని చేస్తున్న టీచింగ్ స్టాఫ్ లెక్క పై ప్రభుత్వానికి స్పష్టత లేదు. ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వానికి సమర్పించే వివరాలకు అక్కడ పనిచేస్తున్న వారి లెక్కలకు తేడా ఉంటోంది. టీచర్లకు సాయం ద్వారా డేటా సేకరించనున్న సర్కార్ తిరుపతిరావు కమిటీ సిఫారసులను అమలు చేయాలని చూస్తుందట..


కరోనా వల్ల స్కూళ్లు మూతపడి ఇబ్బంది పడుతున్న ప్రైవేట్‌ స్కూళ్ల టీచర్లకు నెలకు 2 వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు వీటికోసం దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలో 10 వేల 763 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 30 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఈ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్ల సంఖ్య లక్ష 18 వేలు మాత్రమే. ఈ సంఖ్య దగ్గరే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్‌లో పని చేస్తున్న టీచింగ్ స్టాఫ్ ఇంతేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

రాష్ట్రంలో 3 లక్షల మంది బోధన సిబ్బంది ఉంటారని ప్రైవేట్ టీచర్స్ యూనియన్స్ చెబుతున్నాయి. ప్రభుత్వం దగ్గర లెక్కలు మాత్రం తక్కువగా ఉన్నాయి. మరి.. మిగతా వారు ఎటు పోయారని ప్రశ్నిస్తున్నాయి విద్యావర్గాలు. ఇప్పుడా లెక్కలు బయటకొస్తాయని అనుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వానికి సమర్పించే వివరాలకు అక్కడ పనిచేస్తున్న వారి లెక్కలకు తేడా ఉంటోంది. క్వాలిఫైడ్ టీచర్లు మాత్రమే పాఠశాలల్లో బోధన చేయాలి. ఇలాంటి క్వాలిఫైడ్‌ టీచర్లను పెట్టుకుంటే వారికి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలా స్కూళ్లు అర్హతలేని వారిని టీచర్లుగా పెట్టుకుని అరకొర జీతాలు ఇస్తున్నాయి. రికార్డుల్లో ఎంట్రీలు మరోలా ఉంటున్నాయి.

ఏటా తమ స్కూల్స్‌లో ఎంత మంది పనిచేస్తున్నారో.. ఆ వివరాలను ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖ అధికారులకు ఇవ్వాలి. ఇప్పుడు ఆ లెక్క కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఇచ్చే కరోనా సాయం కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందట. అదే జరిగితే బండారం బయటపడినట్టే. ఒకవేళ తప్పు తెలిసిపోతుందనే ఉద్దేశంతో కరోనా సాయం కోసం టీచర్లకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోతే మరో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూల్‌ యాజమాన్యాల మధ్య వివాదాలు తలెత్తే వీలుంది. అలాగే సర్టిఫై చేయడానికి నిరాకరించే స్కూల్స్‌పై టీచర్లు కలెక్టర్లకు ఫిర్యాదు చేసే ప్రమాదం లేకపోలేదు.

ప్రభుత్వం కూడా ప్రైవేట్‌ పాఠశాలలను నియంత్రించాలనే ఆలోచనతో ఉందని సమాచారం. గతంలో ఇచ్చిన తిరుపతిరావు కమిటీ సిఫారసులను అమలు చేయాలని అనుకుంటోంది. అందుకే కరోనా సాయం కోసం వచ్చే దరఖాస్తుల డేటా గట్టిగానే దృష్టిపెట్టింది టీఆర్ఎస్ సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version