టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం సోమవారంతో రెండు దశాబ్దాలు పూర్తి కానున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఈసారి పార్టీ వేడుకలను చాలా సింపుల్ గా, ఎటువంటి హడావుడి లేకుండా సీఎం కేసీఆర్ కానిచ్చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పార్టీ వేడుకలు ఘనంగా జరపడానికి కేసీఆర్ ససేమిరా అన్నారు. ఎవరికి వారు తమ ప్రాంతాలలో లాక్ డౌన్ నిర్ణయాలు పాటించాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా అమరవీరులకు శ్రద్ధాంజలి వహించాలని సూచించారు. పార్టీని స్థాపించి మరియు రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించి టిఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించిందని సీఎం కేసీఆర్ ఇటీవల తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాలుగా టిఆర్ఎస్ పార్టీ అనేక విజయాలు సాధించిందని చెప్పుకొచ్చారు.
ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సెంటిమెంటును ఆయుధంగా మలచుకుని, ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి, తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని స్థాపించారు. పార్టీ పెట్టిన సమయంలో అవహేళన చేసిన వాళ్ళ ముందే రాష్ట్రాన్ని సాధించి, ప్రభుత్వాన్ని స్థాపించి కేసీఆర్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారు.