తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ ముందస్తు విడుదలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లుగా బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు శశికళ. తాజాగా, ముందస్తు విడుదలకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ప్రత్యేక కోర్టులో తనకు విధించిన జరిమానా చెల్లించిన అనంతరం శశికళ 2021, జనవరి 27న జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా, అంతకంటే ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఇక శశికళ ఇప్పటికే 43 నెలల జైలు శిక్ష అనుభవించారు. దీని ప్రకారం శశికళకు 135 రోజుల జైలు జీవితం నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది. తన సత్ ప్రవర్తన కారణంగా తనను ముందుగానే విడుదల చేయాలని కోరారు. ఆమె వినతిని జైలు అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. దీనిపై వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శశికళ విడుదల కాగానే..తమిళనాట రాజకీయాలు వేడెక్కడం ఖాయం. శశికళ విడుదలై బయటకు వస్తే..జరిగే రాజకీయ పరిణామాలపై అధికారపార్టీ ఏఐఏడీఎంకే ముఖ్య నేతలకు ఆందోళనగా ఉంది.
అందుకే శిక్షాకాలం ముగియగానే జనవరి 27 న విడుదలవుతారని..ఇక ఏ మార్పు ఉండదని చిన్నమ్మ అభిమానులు భావిస్తున్నారు. చిన్నమ్మ రాక నేపధ్యంలోనే చెన్నైలోని కార్యాలయంలో ఆమె వర్గం సమావేశమైంది. జైలు నుంచి నేరుగా మెరీనా బీచ్ వద్ద ఉన్న జయలలిత సమాధికి చేరుకుని శపధం చేస్తారని అభిమానులు చెబుతున్నారు. ఆమె వచ్చే మార్గంలో 65 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.