జీవో 317తో ఉద్యోగుల కాపురాల్లో చిచ్చుపెట్టాడని సీఎం కేసీఆర్ పై విజయశాంతి సీరియస్ అయ్యారు. జీవో నెంబర్ 317తో పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టి, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులైన భార్యభర్తలను ఒకరికొకరు కాకుండా చేస్తూ, వారి పిల్లలకు సైతం అన్యాయానికి గురి చేసిన కేసీఆర్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందని హెచ్చరించారు.
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మా స్థానికతను లాగేసుకోవడం మీకు తగునా?… అని పిల్లల్ని చంకనేసుకుని వచ్చిన తల్లిదండ్రులు ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నరు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధపడ్డరు. ఈ జీవోకి తగిన సవరణలు చెయ్యాలని లేదా రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారన్నారు.
ఈ జీవో వల్ల చోటు చేసుకున్న అర్థంపర్ధం లేని బదిలీల వల్ల ప్రతి రోజూ వందలాది కిలోమీటర్లు ప్రయాణం చెయ్యలేక ఆర్ధికంగా చితికిపోతూ ఆరోగ్యం కూడా పాడవుతోందని టీచర్లు నిరసిస్తూ, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ తీవ్ర వేదన చెందారు. అసలే ఆవేదనలో ఉన్న టీచర్లను పిల్లలతో సహా పోలీసులు స్టేషన్‌కి తరలించడం మరింత అమానుషం. ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఈ కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో ఇంకెలా వెలగబెడతారో చెప్పాల్సిన పని లేదని స్పష్టం చేశారు విజయశాంతి.