బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పార్టీ కార్యకలాపాలు ముమ్మరం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ త్వరగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నుంచి చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల గురువారం రోజున బీఆర్ఎస్లో చేరారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో తాడి శకుంతలతోపాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాల్యాద్రి, పలువురు మైనారిటీ నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తాడి శకుంతల సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పొత్తులో భాగంగా 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్‌గా సేవలందించారు. అనంతరం కాంగ్రెస్, టీడీపీల్లోనూ కొంతకాలం పని చేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.