సౌతాఫ్రికా దేశం వజ్రాలు, విలువైన రాళ్లకు నిలయం అన్న సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న గనుల ద్వారా వజ్రాలు, ఇతర రాళ్లను వెలికి తీస్తుంటారు. అయితే అక్కడి ఓ గ్రామంలో నేలలో వజ్రాలు దొరుకుతున్నాయని తెలిసి జనం పోటెత్తారు. చిన్నా పెద్దా అందరూ కలిసి పలుగు, పార చేతపట్టి నేలలో తవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఈ విషయం అంతటా పాకింది.
సౌతాఫ్రికాలోని క్వాజులు-నేటల్ ప్రావిన్స్‌లో ఉన్న క్వాహ్లాతి అనే గ్రామంలో నేలలో వజ్రాలు దొరుకుతున్నాయని కొందరు చెప్పారు. వారు కొన్ని రాళ్లను సాక్ష్యాలుగా చూపించారు కూడా. కొందరు వాటిని ఒక్కోటి 100 రాండ్లకు (దాదాపుగా 7.29 డాలర్లు) అమ్మినట్లు తెలిపారు. దీంతో ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి జనాలందరూ అక్కడికి తండోప తండాలుగా చేరుకున్నారు. అనేక చోట్ల తవ్వుతూ రాళ్లను తీయడం మొదలు పెట్టారు.
అయితే వారికి రంగు రాళ్లు లభించాయి కానీ అవి వజ్రాలా, ఇతర విలువైన రాళ్లా అనే విషయం తెలియదు. కానీ తమకు రాళ్లు దొరికాయని వారు సంబరపడుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రజలను అక్కడి నుంచి పంపించేశారు. ఆ రాళ్ల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఆ తరువాతే అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. అక్కడ దొరికిన రాళ్లు విలువైనవా, కావా అనేది తనిఖీ చేయాల్సి ఉందన్నారు.