విశాఖ పరిపాలన రాజధాని కోసం అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలన్నారు.
వర్షం పడినా లెక్కచేయకుండా విశాఖ గర్జన ర్యాలీలో పాల్గొన్న ప్రజలకు మంత్రి ధర్మాన ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను తాము గౌరవిస్తామని, కానీ రైతులను అడ్డం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ మాఫియాను మాత్రం సహించబోమని అన్నారు. ఉత్తరాంధ్రవాసులు ఎప్పుడు రాజధానికి దూరంగానే ఉన్నారని.. ఇన్నాళ్లకు దగ్గరగా రాజధాని ఏర్పాటు అవకాశం వచ్చిందని, దాన్ని జారవిడుచుకోవద్దని చెప్పారు. ఉత్తరాంధ్రలో రాజధాని ఉంటే భావితరాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు.