రాజు చచ్చాడు… మరి కుటుంబ పరిస్థితి?

-

సైదాబాద్ లోని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు కథ ఆత్మహత్యతో ముగిసిన సంగతి తెలిసిందే. రైలు పట్టాల మీద అతడి డెడ్ బాడీ కనిపించింది.. ఆ శవానికి అంత్యక్రియల ప్రక్రియ కూడా అయిపోయింది. దీంతో… ఆరేళ్ల బాలిక మీద హత్యాచారం చేసిన నిందితుడి కథ.. రైలు పట్టాల మీద విగతజీవిలా దర్శనమివ్వటంతో ముగిసింది. పోలీసులకు పెద్ద పని తప్పింది.. ప్రభుత్వానికి పెద్దల రిలీఫ్ దొరికింది. మరి రాజు కుటుంబ పరిస్థితి?

గడిచిన వారం రోజులుగా చైత్ర కుటుంబానికి న్యాయం జరగాలని.. రాజును కఠినంగా శిక్షించాలని పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో… రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.. ప్రజల ఆగ్రహాంతో వెన్నులో వణుకు పుట్టిన అతను సూసైడ్ చేసుకున్నాడు. అక్కడితో అతడి అధ్యాయం ముగిసింది. చైత్ర కుటుంబ ఆగ్రహం, ప్రజాగ్రహం కాస్త శాతించింది. మరి రాజుని నమ్ముకున్న అతడి భార్య, బిడ్డ పరిస్థితి?

ఇప్పుడు సమాజంలో ఇది పెద్ద ప్రశ్నగా మిగిలింది. అతడి తప్పులతో, అతడి దుర్మార్గాలతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ సంబంధం లేని రాజు భార్య, బిడ్డ పరిస్థితి ఏమిటి? ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? దానికి ఒకటే సమాధానం! ఇప్పుడు నిందితుడు రాజు కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపైనా ఉంది! వ్యవహారం వేడిగా ఉన్నప్పుడు చైత్ర కుటుంబానికి 10లక్షల సాయం అందించింది తెలంగాణ సర్కార్. రాజు మృతితో దిక్కులేకుండా ఉన్న కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

సమాజం కూడా రాజు కుటుంబానికి తోడుండాలి.. అవకాశం ఉంటే ఆదుకోవాలి! రాజు సమాజంలో చీడపురుగే.. వికృత మనస్థత్వం ఉన్నవాడే.. కానీ అతని భార్యకు ఆ నేరానికి ఏమిటి సంబంధం? అతడి బిడ్డ చేసిన నేరం ఏమిటి? ఈ విషయాలు సభ్యసమాజం గ్రహించాలి. అతడిపై ఇంతకాలం ఉన్న ఆగ్రహం.. ఆ కుటుంబంపై ప్రేమగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

– CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version