హైదరాబాద్: ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్ వేసిన వేటు ఇప్పుడు సంచలనమైంది. అసలు కారణమేంటనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు. ఈటలపై ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కేసీఆర్‌పై చూపిన బలమైన ప్రభావం ఏంటనే ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు . ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అసలు కారణం అది కాదని పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉన్న ఈటలకు ఇలాంటి పరాభవం ఎదురుకావడం వెనుక ఏదో రహస్యం ఉందనేది విశ్లేషకుల అంచనా. కేసీఆర్ వేటు వేశారంటే అందుకు బలమైన కారణం ఉంటుందని భావిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను కూడగట్టి ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారని తాజాగా ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎం కేసీఆర్ కఠినంగా నిర్ణయం తీసుకున్నారని విశ్వనీయ వర్గాల సమాచారం.
పైగా ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీకి అసలైన ఓనర్లు తామేనని, బానిసలంకాదని ఈటల కుండబద్దలు కొట్టారు. సీఎం పరిపాలన తీరుపై, సంక్షేమ పథకాల అమలుపై రాజేందర్ తనదైన శైలిలో విమర్శలు చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. పరోక్షంగా ఈటల ఈ వ్యాఖ్యలు సీఎం కేసీఆర్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉన్నాయి. అలాగే దేవరయాంజల్‌లో ఉన్న ఓ పత్రిక ప్రింటింగ్ ప్రెస్ కోసం స్వయంగా తన భూములను బ్యాంక్‌లో తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చానని ఈటల చెప్పడాన్ని కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారని అంటున్నారు. అందుకే ఈటల చాలా దగ్గరైనా కేసీఆర్ కఠినంగా నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇవే కారణం కాదని, ఇంకో కారణం ఉందని అనుమానిస్తున్నారు.
ఇక ఈటల రాజేందర్ చెప్పినట్లుగానే కేసీఆర్ అంతరాత్మకు తెలుసని, అదే నిజమైతే, అసలు నిజమేంటో బయట పెట్టాల్సిన అవసరం ఈటలపై ఉంటుంది. కానీ దీనిని ఎందుకు బయట పెట్టడం లేదన్నది అంతుచిక్కని రహస్యంగా ఉంది. మొత్తం మీద ఈటల రాజేందర్ వ్యవహారంలో ఏదో తెలియని అంతుచిక్కని రహస్యం దాగి ఉన్నట్లు రాష్ట్రంలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.