కృష్ణా జిల్లాలో కీలకంగా పనిచేసిన దేవినేని అవినాష్.. వల్లభనేని వంశీ టీడీపీని వీడటంతో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నాయకత్వ బాధ్యతలపై అనిశ్చితి నెలకొంది. అయితే చంద్రబాబు ఇప్పటికే నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రెండు నియోజకవర్గాల్లో నూతన ఇన్‌చార్జిల నియామకం సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని ఆయన యోచిస్తున్నారట.
గుడివాడలో టీడీపీ ఇన్చార్జి రేసులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, మాజీ మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు లాంటి నేతలు ఉన్నారు. అయితే కొడాలి నానిని ఎదర్కొవడానికి వీరు సరి తూగరనే ఉద్దేశంతోనే దేవినేని అవినాష్‌ను టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. అవినాష్ ఓడిపోయి పార్టీ మారిపోయాడు. ఇప్పుడు కొడాలినానిని ఎదుర్కొవాలంటే ఎవరిని నిలుపుతారన్నది టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
రావి వెంకటేశ్వరావుకు గతంలో పోటీ చేసిన అనుభవం ఉండటంతో ఆయన్ని ప్రస్తుతానికి ఇన్‌చార్జ్‌గా నియమించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పక్కనబెట్టి ఇప్పుడు ఇన్చార్జ్ ఇస్తామంటే ఆయన అందుకు అంగీకరిస్తారా..? అన్నది కూడా సందేహాస్పదంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గన్నవరంలో కూడా ధీటైన నాయకుడి కోసం చంద్రబాబు గాలించే పడ్డట్లు కార్యకర్తల ద్వారా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, గద్దె అనురాధ, బొండా ఉమాలతో ఓ కమిటీ వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి ఇక్కడ ఎవరికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారోనని ఉత్కంఠగా శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఇక్కడ గద్దె దంపతులే పార్టీకి పెద్ద దిక్కయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు కూడా తమకు తూర్పు సీటు చాలని.. గన్నవరం వద్దనే అంటున్నారు.
మొత్తానికి కృష్ణా జిల్లాలో చెలరేగిన రాజకీయ తుఫాన్‌తో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దేవినేని అవినాష్ సైలెంట్‌గా వెళ్లి జగన్ సమక్షంలో కండువా కప్పుకోగా..వల్లభనేని వంశీ మాత్రం పార్టీలో , గత ప్రభుత్వ హయంలో జరిగిన విషయాలను బయటపెడుతూ..చంద్రబాబు, లోకేష్‌లే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తుండటం గమనార్హం. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి టీడీపీకి సరైన నాయకుల కొరత తీవ్రంగా ఉంది.