పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఉల్లిపాయల ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిపాయల ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. కిలో ఉల్లిపాయల ధర రూ.20 నుంచి అమాంతం రూ.80కి చేరి ఇప్పుడు కొన్ని చోట్ల ఏకంగా రూ.100 పలుకుతోంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో అయితే ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఉల్లిపాయల ధరలు మరీ ఇంతలా పెరిగిపోవడానికి అసలు కారణాలేమిటంటే…
అక్టోబర్ 23వ తేదీ నాటికి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఉల్లిపాయల ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కేజీ ఉల్లిపాయలకు రూ.58 ధర ఉండగా, ముంబైలో రూ.97, చెన్నైలో రూ.83, కోల్‌కతాలో రూ.80 ఉన్నాయి. కేంద్ర ఆహార, వినియోగదారుల సంబంధాల మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఇక అక్టోబర్ 27న రాంచీలో కేజీ ఉల్లిపాయలు రూ.85 పలకగా, పాట్నాలో రూ.70, లక్నోలో రూ.80 ధర పలికాయి. అలాగే దేశంలోని అనేక నగరాలు, పట్టణాల్లోనూ ఉల్లిపాయల ధరలు ఇంచు మించు ఇలాగే ఉన్నాయి.
ఉల్లిపాయల ధరలు అంతలా పెరగడానికి గల కారణం ఇటీవలి కాలంలో భారీగా కురిసిన వర్షాలే అని చెప్పవచ్చు. దీంతో రైతులు, వినియోగదారులకు ఉల్లి చుక్కలు చూపిస్తోంది. ఇక దేశంలో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న లసల్‌గావ్ ఆసియాలోనే అతి పెద్ద ఉల్లిపాయల మార్కెట్‌గా పేరుగాంచింది. భారతదేశంలో ప్రజలు వినియోగించే మొత్తం ఉల్లిపాయల్లో 1/3 వ వంతు ఉల్లిపాయలు ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతాయి. అయితే గత కేంద్రం ఇటీవలే ఉల్లిపాయల నిల్వలపై ఆంక్షలు విధించింది. హోల్‌సేల్ వ్యాపారులు గరిష్టంగా 25 టన్నుల వరకు, రిటెయిల్ వ్యాపారులు గరిష్టంగా 2 టన్నుల వరకు మాత్రమే ఉల్లిపాయలను తమ వద్ద నిల్వ ఉంచుకోవాలి. దీంతో నాసిక్‌లో వ్యాపారులు నిరసన తెలుపుతున్నారు. దీని వల్ల ఉల్లి సరఫరా మరింత తగ్గింది. అందువల్లే ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
అయితే వ్యాపారస్తుల నిరసనలు మరికొద్ది రోజుల పాటు ఇలాగే సాగితే ఉల్లి ధరలు ఇప్పటి కన్నా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు అంటున్నారు. మరి ప్రభుత్వాలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.