శివపూజకు ఏ పూలు వాడితే ఏం ఫలితమో మీకు తెలుసా !

-

శివ.. సులభంగా అనుగ్రహించే దేవుడు. సామాన్య భక్తులను శ్రీఘ్రంగా అనుగ్రహిస్తాడు. దేవతలకు, రాక్షసులకు కూడా ఈయన వరాలిచ్చే వేల్పు అనడంలో అతిశయోక్తిలేదు. రావణాసురుడు, మహిషాసురుడు, త్రిపురాసురుడు ఇలా ఎందరో రాక్షస భక్తులను సైతం అనుగ్రహించిన మహాదేవుడు భోళా శంకరుడు. అయితే ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి శివపూజలో ఉపయోగించాల్సిన పూజల గురించి పలు పురాణాల్లో, శాస్త్రాలలో పేర్కొన్న విశేషాలు తెలుసుకుందాం…

శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం. వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం. వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం. వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం. వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం. వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పూవుఉత్తమం. వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.

వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపూవు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపూవు శ్రేష్ఠం.
వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు. పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతారు. ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.

సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.

ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు. పైన చెప్పిన పూలన్నిటిని ఆయన సృష్టించినవే. వాటన్నింటికంటే అత్యుత్తమమైనది సాధారణత్వం నుంచి సర్వజ్ఞత్వం ఇచ్చే పువ్వు హృదయపుష్పం. ఇది సమర్పిస్తే ఆ మహాదేవుడు అన్నింటిని అనుగ్రహిస్తాడు. దీనికంటే పెద్ద పుష్పం ఈ విశ్వంలో లేదు అని సాక్షాత్తు శివస్వరూపం అయిన శ్రీ శకంరభగవత్‌పాదులు వారు చెప్పారు. ఇక ఈ శివరాత్రినాడు మీ శక్తికొలది హృదయపుష్పాన్ని స్వామి వారికి సమర్పించి తరించండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version