బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది. ఈనెల 15న ఉదయం11 గంటలకు విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ తెలిపింది. ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తర్వాత బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలకు చేపట్టాయి. బండి సంజయ్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. ఆయనను బీజేపీ నుంచి బహిష్కరించాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మహిళా అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలకు చేపట్టారని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనపై చర్యలు చేపట్టాలని పలు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు కూడా చేశారు. చట్టపరంగా కేసులు నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కవితతోపాటు మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ జాతీయ మహిళా కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంజయ్‌పై ఫిర్యాదు చేస్తూ కమిషన్‌కు లేఖ రాశారు. కవిత పట్ల అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కాగా, సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. సోమవారం సంజయ్‌కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కాగా సంజయ్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు.