బ‌డ్జెట్ విష‌యంలో జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన య‌న‌మ‌ల‌..!

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో బడ్జెట్-2020ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసింది. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని ఆమె ప్రసంగం మొదట్లో చెప్పుకొచ్చారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న నిర్వాకాల వల్లే బడ్జెట్లో ఏపీకి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ తుగ్గక్ చర్యల వల్లే ఏపీకి ఎలాంటి నిధులను కేంద్రం ప్రకటించలేదని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టడంలో జగన్ విఫలమవుతున్నారని అన్నారు. వైసీపీ అవినీతి, అసమర్థ పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని చెప్పారు.

రాజధానికి నిధులు వద్దని తొలి వినతిలోనే ప్రధాని మోదీకి జగన్ చెప్పారని అన్నారు. విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేయడం జగన్ చేసిన తొలి తప్పిదమని యనమల చెప్పారు. ఇది తిక్క పని అని ఐదు దేశాల ఎంబసీలు హెచ్చరించాయని తెలిపారు. కోర్టులు, కేంద్ర ప్రభుత్వం చెప్పినా జగన్ వినలేదని దుయ్యబట్టారు. జగన్ మూర్ఖత్వంతో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. 8 నెలల్లోనే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను పోగొట్టారని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం కూడా కేంద్రం నుంచి నిధులను తెచ్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల ఏపీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version