సొంత పార్టీ నేతలకే చుక్కలు చూపిస్తున్న షాడో ఎమ్మెల్యే

-

నియోజకవర్గంలో పెత్తనం అంతా ఆయనదేనని చెబుతారు. కాంట్రాక్ట్ పనుల్లో ఆయన జోక్యం చేసుకుంటారని అధికార పార్టీ నేతలే ఆరోపిస్తుంటారు. అక్కడ ఏ వర్క్‌కు కాంట్రాక్ట్ చేయాలన్న సదరు షాడో అనుమతి కావాలట. ఒకవేళ ఆయన చెప్పినట్టు వినకుండా ఎవరైనా అడ్డుకున్నా.. కాంట్రాక్ట్‌ పనుల్లో జోక్యం చేసుకున్నా.. పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సిందేనట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ భర్త హరిసింగ్‌ వివాదాలతో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారారు.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దిగా విజయం సాధించారు హరిప్రియ నాయక్ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అధికారపార్టి గూటికి చేరారు. ఆ తర్వాత వరుస వివాదాలు ఎమ్మెల్యేను చుట్టుముడుతూనే ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే హరిప్రియ తండ్రి వల్ల భూ తగాదాలు వెలుగులోకి వచ్చి అవి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లాయి. ఇప్పుడు భర్త హరిసింగ్ షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో హల్ చల్ చేస్తున్నారు. ఆయన వల్ల ఇబ్బంది పడుతున్నామని సొంత పార్టీ నేతలే ఓపెన్‌గా కామెంట్స్‌ చేస్తున్నారు.

హరిసింగ్‌ ప్రస్థుతం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఎమ్మెల్యే భర్తకు ఎదురొచ్చే వారు అధికారపార్టీ నేతలైనా ఉపేక్షించరట హరిసింగ్‌. వెంటనే ఏదో ఒక కేసులో ఇరికించి లోపల వేస్తారని కథలు కథలుగా చెప్పుకొంటున్నాయి గులాబీ శ్రేణులు. ఇందుకు అనేక ఉదాహరణలు చెబుతున్నారు పార్టీ నాయకులు. నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో లక్కినేని సురేందర్‌ స్థానికంగా పార్టీ నేత. డీసీసీబీ డైరెక్టర్‌. ఆ మండలంలో నిన్న మొన్నటి వరకు ఆయన హవానే నడిచిందట. ఎమ్మెల్యే హరిప్రియ శిబిరంలోనే ఉన్నారట. అయితే కొన్ని కాంట్రాక్ట్‌ పనుల విషయంలో ఎమ్మెల్యే భర్త హరిసింగ్‌కు సురేందర్‌కు మధ్య తేడాలొచ్చాయట.

ఓ పని కోసం టెండర్‌ వేయడానికి వెళ్తోన్న సురేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పని ఉందని చెప్పి చాలాసేపు పోలీస్‌ స్టేషన్‌లోనే కూర్చోబెట్టారట. ఈ ఘటన స్థానికంగా టీఆర్‌ఎస్‌లో దుమారం రేపింది. ఈ మొత్తం వ్యవహారం వెనక ఎమ్మెల్యే భర్త ఉన్నారన్నది సురేందర్‌ వర్గం చేసే ఆరోపణ. ఇప్పుడీ సమస్య శ్రుతిమించి రాగాన పడుతున్నట్టు సమాచారం. పోలీసులను అడ్డుపెట్టుకుని సొంత పార్టీ నేతలను వేధించడం సరికాదని మండిపడుతున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు.

ఇప్పుడు ఏకంగా అధిష్ఠానానికి కూడా డెడ్ లైన్ పెట్టారట..జోక్యం చేసుకోకపోతే చివరకు పార్టీని వదిలి వెళ్లిపోతానని ఎమ్మెల్యే భర్త బాధితులు హెచ్చరిస్తున్నారట పార్టీ నేతలు. అయితే ఇల్లెందు రగడపై పార్టీ పెద్దలు దృష్టిపెట్టినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version