రాజకీయాల్లో నాయకులకు కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసిరావాలి. అప్పుడే రాజకీయాల్లో మంచి సక్సెస్ చవిచూస్తారు. లేదంటే నాయకులు సక్సెస్ కాలేరు. అయితే రాజకీయాల్లో కష్టపడినా, అదృష్టం కలిసిరాక సక్సెస్ కాని నేతలు చాలామందే ఉన్నారు. అలా కష్టపడిన ఇప్పటివరకు అదృష్టం కలిసిరాని నాయకుల్లో చలమలశెట్టి సునీల్ (Chalamalasetty Sunil) ముందువరుసలో ఉంటారు. కాపు సామాజికవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న సునీల్, చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున కాకినాడ ఎంపీగా పోటీ చేశారు.
అయితే ఊహించని విధంగా సునీల్ కేవలం 34 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పళ్లంరాజు చేతిలో ఓడిపోయారు. ఇక ఓడిపోయాక కాస్త రాజకీయాల్లో సైలెంట్ అయ్యారు. తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో విలీనం కావడం, జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీ పెట్టడంతో సునీల్ అందులో చేరిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో సునీల్ వైసీపీ తరుపున కాకినాడ ఎంపీగా బరిలో దిగారు. ఈ సారి కూడా సునీల్‌కు అదృష్టం కలిసిరాలేదు. కేవలం 3 వేల ఓట్ల తేడాతో సునీల్, టీడీపీ నుంచి పోటీ చేసిన తోట నరసింహం చేతిలో ఓడిపోయారు.
సరే ఓడిపోయాక సునీల్ వైసీపీలో నిలకడగా లేరు. కొన్నిరోజులు సైలెంట్‌గా ఉండి అనూహ్యంగా టీడీపీలో చేరిపోయారు. అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున కాకినాడ ఎంపీ టిక్కెట్ దక్కించుకున్నారు. టీడీపీలోకి వచ్చినా సరే సునీల్‌ని దురదృష్టం వెంటాడింది. సునీల్ ఈ సారి 25 వేల ఓట్ల తేడాతో వైసీపీ తరుపున పోటీ చేసిన వంగా గీత చేతిలో ఓడిపోయారు. ఇటు వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో సునీల్ మళ్ళీ ప్లేట్ మార్చేశారు.
మరోసారి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీలో చేరాక సునీల్ సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పటివరకు సునీల్‌కు జగన్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. మొదట్లో రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగింది గానీ, ఇంకా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. మరి రానున్న మూడేళ్లలో జగన్, సునీల్‌కు ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.