పోడు పట్టాలపై వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు పోడు రైతులను కొట్టి,హింసించి, జైలులో వేసిన దొర గారికి ఓట్ల పండగ దగ్గరకు రాగానే మళ్లీ పోడు రైతులు యాదికొచ్చారు. తొమ్మిదేండ్లలో ఎనిమిది సార్లు పోడు పట్టాలు ఇస్తానని ప్రకటించి పోడు రైతుల్ని నిండా ముంచాడని అగ్రహించారు. ఊరించి, ఊరించి కొసరేసినట్టు కొంతమందికే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు షర్మిల.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12.50 లక్షల ఎకరాల్లో పోడు భూములు ఉన్నాయని స్వయంగా అధికారులే లెక్కలు బయటపెడితే.. ఆ కాగితాలను చింపేసి కాదు 4.05 లక్షల ఎకరాలే పోడు పట్టాలు అని సొంత లెక్కలు బయటపెట్టాడని విమర్శలు చేశారు. 25 శాతం భూములకు మాత్రమే పోడు పట్టాలు ఇచ్చి, మిగిలిన రైతులకు ఎగనామం పెట్టడమే దొర గారి దురాలోచన అన్నారు. పోడు రైతుల పట్ల కేసీఆర్ కు చిత్తశుద్ధే ఉంటే.. నాలుక మీద నరమే ఉంటే ఇచ్చిన హామీ ప్రకారం.. 12.50లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు షర్మిల.