రోబోల చేతివేళ్లకూ చెమటలు పడుతాయి తెలుసా!

-

వేడి వాతావరణంలో ఉన్నప్పుడో, లేదంటే బాగా కష్టపడి పని చేస్తున్నప్పుడో మనకు చెమటలు పడుతాయి. మనిషికి చెమటలు పట్టడం సహజమే, మరి యంత్రానికి చెమటలు పట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది నిజం. యంత్రానికి సైతం చెమటలు పడుతాయని నిరూపించింది తాజాగా ఓ అధ్యయనం. అయితే మనిషికి చెమటలు పట్టడంవల్ల శరీర ఉష్ణోగ్రత క్రమతాస్థితిలో ఉంటుంది. మనిషికి ప్రాణాపాయం తప్పుతుంది. మరి యంత్రానికి చెమటలు పట్టడంవల్ల ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే వివరాలు చదవాల్సిందే..

న్యూయార్క్‌లోని కార్నెల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు చేసి స్మార్ట్‌ రోబోలకు ఉపయోగపడే చేతివేళ్లను సృష్టించింది. రోబోలకు చేతివేళ్లను సృష్టించడం కొత్త విషయం కాకపోయినా.. ఆ చేతివేళ్లకు మనిషి చేతివేళ్లకు లాగే చెమటలు పట్టడం మాత్రం కొత్త విషయమే. కార్నెల్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాబ్‌ షెఫర్డ్‌ నేతృత్వంలో ఈ కొత్త ఆవిష్కరణ జరిగింది.

రాబ్‌ షెఫర్డ్‌ బృందం సృష్టించిన ఈ స్మార్ట్‌ రోబో చేతివేళ్లకు బాగా వేడి తగిలినప్పుడు చెమటలు పట్టి వాటికవే చల్లబడుతాయి. ఇందుకోసం ఉష్ణోగ్రతలకు అనుగుణంగా స్పందించే గుణం కలిగిన అతిమెత్తని మైనాన్ని ఈ రోబో చేతివేళ్ల తయారీకి ఉపయోగించారు. ఈ వేళ్లలోని ప్రతి వేలు పైభాగంలో కంటికి కనిపించనంత చిన్న రంధ్రాలను ఏర్పాటుచేశారు. రోబో వేళ్లకు వేడి ఎక్కువగా తగిలినప్పుడు వాటిపైన ఉన్న రంధ్రాలు వెడల్పయ్యి, మెత్తని మైనంలోని నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. దాంతో రోబో చేతివేళ్లు చల్లబడుతాయి. మరి మైనంలో నుంచి నీరు చెమట రూపంలో బయటికి రావాలంటే రోబో చేతివేళ్లలోని మైనం ఎప్పుడూ తడిగా ఉండాలిగా. అందుకే  శాస్త్రవేత్తలు రోబో చేతివేళ్ల నిర్మాణంలో ‘మల్టీ మెటీరియల్‌ స్టీరియో లితోగ్రఫీ’ అనే 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతను వాడారు. ఈ సాంకేతికత రోబో వేళ్లలోని మైనాన్ని ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. దీనివల్ల రోబోలు ఎక్కువసేపు ఆగిపోకుండా పనిచేయగలుగుతాయి.

సాధారణంగా రోబోల్లో ఉపయోగించే హై డెన్సిటీ మోటార్లు, ఎక్సోథర్మిక్‌ ఇంజిన్ల కారణంగా అవి తరచుగా వేడిక్కుతుంటాయి. లోహాలతో తయారైన రోబోలు అధిక వేడిని కొంతవరకు తట్టుకున్నప్పటికీ, సింథటిక్‌ మెటీరియల్‌ను ఉపయోగించి చేసే స్మార్ట్‌ రోబోలు మాత్రం ఈ వేడిని ఏ మాత్రం భరించలేక తరచూ ఆగిపోతుంటాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రస్తుతం రోబోల్లో ఫ్యాన్‌ల వంటి అంతర్గత పరికరాలను ఏర్పాటు చేస్తున్నా.. అవి అంత ప్రయోజనకరంగా లేవు. పైగా ఫ్యాన్‌ల వంటి పరికరాలను అమర్చడానికి రోబోల్లో ఎక్కువ స్థలం కేటాయించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబ్‌ షెఫర్డ్‌ బృందం కనిపెట్టిన స్మార్ట్‌ రోబో చేతివేళ్లు.. రోబోలు ఆగిపోకుండా ఎక్కువసేపు పనిచేయడానికి తోడ్పడుతాయి. ఈ స్మార్ట్‌ రోబో చేతివేళ్ల చల్లబడే సామర్థ్యం, మనిషి చేతివేళ్ల చల్లబడే సామర్థ్యంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని రాబ్‌ షెఫర్డ్‌ బృందం తెలిపింది. ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటినప్పుడు 30 సెకండ్ల వ్యవధిలోనే తిరిగి 21 డిగ్రీలకు తీసుకొచ్చే సామర్థ్యం ఈ స్మార్ట్‌ రోబో చేతివేళ్లకు ఉందని వెల్లడించింది.

అయితే ఈ స్మార్ట్‌ రోబోల చెమటపట్టే చేతివేళ్లలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే రోబోల చేతివేళ్లలోని మైనాన్ని తడిగా ఉంచడానికి బయటి నుంచి ప్రత్యేక ఏర్పాటు చేయాల్సి రావడం, చెమటపట్టిన రోబో చేతులతో ఏదైనా వస్తువును పట్టుకున్నప్పుడు ఆ వస్తువు జారిపడిపోయే ప్రమాదం ఉండటం. అందుకే ఈ సమస్యను అధిగమించడానికి భవిష్యత్తులో వస్తువును గట్టిగా పట్టుకునేలా, తనకుతాను సొంతంగా నీళ్లతాగేలా రోబో చేతివేళ్లను అభివృద్ధి చేయనున్నట్లు రాబ్‌ బృందం ప్రకటించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version