వాట్సాప్ వివాదాస్పద ప్రైవసీ పాలసీని ప్రవేశపెట్టడం ఏమోగానీ పెద్ద సంఖ్యలో యూజర్లు ఇప్పటికే టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లకు మారారు. ఈ క్రమంలోనే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కాగా జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ అయిన నాన్ గేమింగ్ యాప్‌లలో టెలిగ్రామ్ మొదటి స్థానంలో నిలిచింది. దీన్ని భారత్‌లోనే అత్యధికంగా 24 శాతం మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
సెన్సార్ టవర్ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి నెలలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డౌన్లోడ్స్ను పూర్తి చేసుకున్న నాన్ గేమింగ్ యాప్‌గా టెలిగ్రామ్ నిలిచింది. ఆ తరువాత స్థానంలో టిక్‌టాక్ నిలవగా, మూడో స్థానంలో సిగ్నల్ నిలిచింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ నోటీస్‌ను అందించడం మొదలు పెట్టాక భారీ సంఖ్యలో యూజర్లు టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు మారారు. అయితే భారత్‌లో మాత్రం టెలిగ్రామ్‌లో ఎక్కువ మంది యూజర్లు చేరారు. ఆ తరువాత ఇండోనేషియా వాసులు ఎక్కువగా టెలిగ్రామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.
ఫిబ్రవరి 8 తేదీలోగా నూతన ప్రైవసీ పాలసీకి అంగీకారం తెలపకపోతే వాట్సాప్ అకౌంట్‌ను కోల్పోవాల్సి వస్తుందని చెప్పడంతో భారీ సంఖ్యలో యూజర్లు విసుగు చెందారు. వారు ఇతర ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లకు మారారు. అయితే వాట్సాప్ లో ఉన్న చాట్లను ఇంపోర్ట్ చేసుకునే సదుపాయం కల్పించడంతోనే టెలిగ్రామ్‌లోకి ఎక్కువ మంది మారినట్లు తెలుస్తోంది. ఇక వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ అమలు నిర్ణయాన్ని మరో 3 నెలల వరకు వాయిదా వేసింది.