కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ యాప్ ను బ్యాన్ చేసిన తరువాత దాన్ని పోలిన మేడిన ఇండియా యాప్స్ అనేకం వచ్చాయి. ఇప్పటికే పలు యాప్‌లకు యూజర్ల నుంచి విశేష రీతిలో ఆదరణ లభించింది. అయితే యూట్యూబ్ కూడా టిక్‌టాక్ యూజర్ల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ షార్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఫీచర్‌కు ప్రస్తుతం భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది.
యూట్యూబ్ షార్ట్స్ ఫీచర్‌ను యూట్యూబ్‌లో సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ ఫీచర్‌కు విశేష రీతిలో స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులో లేదు. కేవలం ఇండియన్ యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ యూట్యూబ్ షార్ట్స్‌లో 3.5 బిలియన్ల వ్యూస్ వస్తున్నాయని యూట్యూబ్‌కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌కు యూట్యూబ్ షార్ట్స్ ప్రత్యామ్నాయంగా మారుతుందని అంటున్నారు.
యూట్యూబ్ షార్ట్స్‌లో యూజర్లు 15 సెకన్ల నిడివి ఉండే వీడియోలను పోస్ట్ చేయవచ్చు. టిక్‌టాక్‌లాగే ఇది పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఫీచర్‌కు భారత యూజర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారో వేచి చూస్తే తెలుస్తుంది. కాగా ఫేస్‌బుక్ కూడా ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్నాప్‌చాట్‌లో స్పాట్‌లైట్ పేరిట ఇలాంటి ఫీచరే లభిస్తోంది. కానీ యూట్యూబ్ షార్ట్స్‌కు వచ్చినంత ఆదరణ వాటికి లభించడం లేదు. దీంతో టిక్‌టాక్‌ను యూట్యూబ్ షార్ట్స్ భర్తీ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.