కోవిడ్ టీకాలను వేయించుకోవాలంటే ముందుగా స్లాట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్న విషయం విదితమే. అందులో భాగంగానే కోవిన్, ఆరోగ్య సేతు వంటి యాప్స్, వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే థర్డ్ పార్టీ సంస్థల ద్వారా కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలని కేంద్రం భావించింది. అందులో భాగంగానే వ్యాక్సిన్ స్లాట్లను బుక్ చేసే సదుపాయాన్ని ఇతర సంస్థలకు కూడా కేంద్రం కల్పించింది. ఈ క్రమంలోనే డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎంలో ఈ సదుపాయం తాజాగా అందుబాటులోకి వచ్చింది. పేటీఎంలోనూ ఇకపై ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు.
దేశంలోని ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గాను పేటీఎంలో వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో కోవిడ్ వ్యాక్సినేషన్ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. తమకు సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్‌ను పేటీఎం యాప్‌లో వెదకవచ్చు. ఆయా సెంటర్లలో ఎన్ని స్లాట్లు అందుబాటులో ఉన్నాయో కూడా చూపిస్తుంది. ఏయే సెంటర్లలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఇస్తున్నారో తెలిసిపోతుంది.
కోవిన్ యాప్ తరువాత వ్యాక్సిన్ స్లాట్లను బుక్ చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చిన రెండో యాప్ ఇదే కావడం విశేషం. పేటీఎంలో ఆయా సదుపాయాలను యూజర్లు పొందవచ్చు. పేటీఎం యాప్‌లోకి వెళ్లి అందులో ఉండే కోవిడ్ వ్యాక్సిన్ ఫైండర్ ఆప్షన్‌లో వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక వ్యాక్సిన్ సెంటర్లను పిన్‌కోడ్‌తో కూడా వెదకవచ్చు. జిల్లాల వారీగా కూడా వ్యాక్సిన్ సెంటర్ల సమాచారం తెలుసుకునే సదుపాయం కూడా కల్పించారు.