అంబేద్కర్ పై మంత్రి విడదల రజిని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిపాలన ఎలా ఉండాలో, ప్రజాస్వామ్యం ఎలా పనిచేయాలో ముందే ఊహించి చెప్పిన గొప్ప దార్శినికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజిని గారు తెలిపారు. కొరిటెపాడు సెంటర్లో బుధవారం మంత్రి విడదల రజిని గారు అంబేద్కర్ గారు, వైఎస్సార్ గారి విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయమే అక్కరలేని పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుందని పేర్కొన్నారు. గొప్ప పరిపాలనతో ప్రతి పేద ఇంటికి దైవంగా మారిన గొప్ప నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అని కొనియాడారు. గొప్ప నాయకుల విగ్రహాల ఏర్పాటు ఎంతో గర్వకారణమని చెప్పారు. మంత్రి వెంట ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ల పార్టీ అధ్యక్షులు, అనుబంధ కమిటీల నాయకులు, క్లస్టర్ ఇన్చార్జిలు, మండల ఇన్చార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.