కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గురుకులాల్లో చోటుచేసుకున్న విద్యార్థుల మరణాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాజీ మంత్రి టి.హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే గురుకులాల్లో నెలకు ముగ్గురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.
ఇప్పటివరకు మొత్తం 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగిస్తున్నాయని విమర్శించారు. గురుకుల విద్యార్థుల మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని హరీశ్ రావు స్పష్టంచేశారు.గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు.