రాష్ట్ర అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న క్రమంలో ఆ చుట్టు పక్కల ధర్నాలు, నిరసనలకు ప్రభుత్వం అనుమతిని నిషేధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ పరిసరాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరైనా తమ సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేస్తే వారిని అరెస్టు చేసి వెంటనే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
తాజాగా ఇదే విషయంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘అసెంబ్లీ జరిగేటప్పుడు ధర్నాలు చేసుకోడానికి అనుమతి ఇవ్వడం లేదు. అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రజలు ఉద్యమం చేస్తే వాళ్ల బాధలు మనకి తెలుస్తాయని వాళ్ల ఆశ’ అని సీపీఐ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ అంశంపై మరోసారి ఆలోచించి ప్రజలు తమ ఆందోళనను స్వేచ్ఛగా తెలుపుకునేలా అనుమతులు ఇవ్వాలని ఈ సందర్బంగా కోరారు.