తెలుగువారి ఇళ్లల్లో సంక్రాంతి సందడి మొదలైందంటే చాలు… అందరి మనసుల్లో ఒకే ప్రశ్న తలెత్తుతుంది. ఈసారి పండుగ ఏ రోజున వస్తోంది? కొన్ని క్యాలెండర్లు ఒక తేదీ చెబుతాయి, మరికొన్ని మరో తేదీ చూపిస్తాయి. పైగా సోషల్ మీడియాలో కూడా రకరకాల సమాచారం తిరుగుతుండటంతో చాలామంది అయోమయంలో పడిపోతుంటారు. ముఖ్యంగా భోగి పండుగ ఏ రోజున జరుపుకోవాలి అన్న విషయం పెద్ద చర్చగానే మారుతుంది. ఇంట్లో పెద్దవాళ్లు ఒక మాట అంటారు బయట వేరే మాట వినిపిస్తుంది. అసలు శాస్త్రం ప్రకారం ఏ రోజు భోగి చేయాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. అందుకే పండితుల సూచనల ఆధారంగా భోగి పండుగ అసలు తేదీ ఏది, సులభంగా స్పష్టంగా తెలుసుకుందాం..
భోగి పండుగ ఎప్పుడు? అయోమయానికి చెక్!:సంక్రాంతి పండుగ తిథుల ప్రకారం కాకుండా, సూర్యుడి గమనాన్ని బట్టి (సౌరమానం) జరుపుకుంటాం. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజును మనం ‘భోగి’గా జరుపుకుంటాం.

తేదీ ఎందుకు మారుతుంది?:
సాధారణంగా జనవరి 13న భోగి, 14న సంక్రాంతి వస్తుంటాయి. అయితే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం (మకర సంక్రమణం) అర్ధరాత్రి దాటినప్పుడు లేదా సాయంత్రం వేళల్లో జరిగినప్పుడు.. తిథి లెక్కల ప్రకారం పండుగ తేదీ ఒక రోజు అటు ఇటు మారుతుంది.
ఈ ఏడాది పండితుల స్పష్టత: ప్రముఖ పంచాంగ కర్తల ప్రకారం, ఈ ఏడాది జనవరి 14వ తేదీనే (బుధవారం) భోగి పండుగను జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. సూర్య గమనాన్ని అనుసరించి మరుసటి రోజు అనగా జనవరి 15న మకర సంక్రాంతి వస్తుంది.
భోగి విశేషాలు – మనం నేర్చుకోవాల్సింది: ముందు మనకి గుర్తుకు వచ్చేది భోగి మంటలు. అందరూ తెల్లవారుజామునే పాత వస్తువులను మంటల్లో వేయడం అంటే కేవలం చెత్తను కాల్చడం కాదు. మనలోని నెమ్మది (బద్ధకం), చెడు ఆలోచనలను వదిలేసి కొత్త వెలుగులోకి రావాలని దీని అర్థం.
భోగి పళ్లు: చిన్న పిల్లలకు రేగు పళ్లు, నాణేలు కలిపి తల మీద పోస్తారు. దీనిని ‘దిష్టి’ తీయడం అంటారు. శాస్త్రీయంగా రేగు పళ్లు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బొమ్మల కొలువు: ఇంటికి కలకళ తెచ్చేందుకు బొమ్మల కొలువు తీరుస్తారు. ఇది మన సంస్కృతిని తర్వాతి తరానికి పరిచయం చేసే ఒక చక్కని మార్గం.
గమనిక: ప్రాంతీయ ఆచారాలు, మీ ఊరిలోని స్థానిక పంచాంగాలను బట్టి సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కాబట్టి మీ కులదైవం లేదా ఇంటి పురోహితులను ఒక్కసారి సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
