యాక్షన్ సినిమా చూస్తే సినీప్రియులకు వచ్చే ఆ మాజానే వేరు. థియేటర్లో మూవీ చూస్తున్నంత సేపు ‘సీన్ అదిరిపోయింది.. స్టంట్ సూపర్’ అంటూ ఈలలు, కేరింతలతో అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. సహజంగా ఈ యాక్షన్ సినిమాలు అనగానే కత్తులు, తుపాకులు వంటి మారణాయుధాలు కనిపిస్తుంటాయి. వీటితో కథానాయకులు, విలన్లు చేసే ఫైట్లు, స్టంట్లు అదరహో అనిపిస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని ఆయుధాలు, వాటితో మన హీరోలు.. ప్రత్యర్థులను నాశనం చేసేందుకు సృష్టించే విధ్వంసం వంటి హై వోల్టేజ్ సన్నివేశాలు ప్రత్యేకంగా నిలిచిపోతుంటాయి.
సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేస్తాయి. ‘ఈ ఒక్క సీన్ చాలురా బొమ్మ బ్లాక్‌బస్టర్’ అనిపించేలా ఉంటాయి. ఫలానా సినిమా అనగానే మొదటగా ఆ సీనే లేదా ఆయుధమే మెదడులో మెదిలేలా చేస్తాయి. సినిమాలో అవి కూడా ఓ పాత్రను పోషిస్తున్నాయని మనల్ని గుర్తుచేస్తాయి. అయితే ఈ మధ్యలో మన యాక్షన్ చిత్రాలు గమనిస్తే… మూవీకే ప్రత్యేకంగా, హైలైట్‌గా ఉండేలా పవర్ఫుల్, భారీ గన్స్‌ను ఉపయోగిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా వీటితో క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్స్‌ను భారీ రేంజ్లో చిత్రీకరించి సినీప్రియులను ఆకట్టుకుంటున్నారు. థియేటర్లను దద్దరిల్లేలా చేస్తున్నారు. ఇటీవలే వచ్చిన ‘కేజీయఫ్ 2’, ‘విక్రమ్’ సినిమాలే నిదర్శనం. ఓ సారి ఆ సీన్స్‌ను చూసేద్దాం. ఇంకా ఎవరైనా అలాంటి హై రేంజ్ సీన్స్‌తో వస్తున్నారా తెలుసుకుందాం..
‘విక్రమ్’.. యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. మాదకద్రవ్యాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఇందులోని యాక్షన్, ఫైట్ సీక్వెన్స్‌లు చూసి సినీ ప్రియులందరూ ఔరా..! అన్నారు. అయితే క్లైమాక్స్ సీన్లో విలన్స్‌పై విరుచుకుపడిన కమల్.. ఓ సందర్భంలో ఏకంగా భారీ వెపన్ కెనాన్‌తో(cannon) విధ్వంసం సృష్టిస్తారు. ఈ హై వోల్జేజ్ యాక్షన్ సీన్ ఫ్యాన్స్‌తో పాటు ప్రతీ సినీప్రేక్షకుడిని ఉత్కంఠకు గురి చేశాయి. కాగా, ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.
‘కేజీయఫ్ 2’.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ ముందు రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇందులో ప్రతి సన్నివేశం ఓ హై వోల్జేట్ అనే చెప్పాలి. ఇక ఆ సన్నివేశాల్లో రాకింగ్ స్టార్ యశ్ లుక్, స్టైల్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ మెస్మరైజ్ చేశాయి. అయితే ఓ సందర్భంలో తన దగ్గర ఉన్న ఓ బంగారంలోని ఓ గోల్డ్ బిస్కెట్ చోరీ అవుతుంది. అది ఓ పోలీస్ స్టేషన్లో ఉందని తెలుసుకున్న యశ్.. ఏకంగా ఆ పోలీస్ స్టేషన్ ముందు భారీ విధ్వంసం సృష్టిస్తాడు. తన దగ్గర ఉన్న భారీ అమెరికన్ మేడ్ ఎమ్1919 బ్రౌనింగ్ మెషిన్ గన్ను తీసుకొచ్చి దాంతో స్టేషన్ ముందు ఉన్న జీవులన్నింటినీ పేల్చి వేస్తాడు. ఇక ఈ పేల్చడం అయిపోయాక.. ఆ భారీ గన్‌కు వచ్చిన హీట్‌తో సిగ్రెట్ను స్టైల్‌గా కాల్చుకుంటాడు. ఈ సన్నివేశానికి ప్రేక్షకులకి థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. సౌండ్ బాక్స్‌లన్నీ బద్దలైపోయాయి. ఈ సీన్ చిత్రానికే ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి.
‘ఖైదీ’.. తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు కార్తి. ఆయన కీలక పాత్రలో లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఖైదీ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కథ, బిగి సడలని కథనం, లోకేశ్ కనరాజ్ టేకింగ్, కార్తి నటన సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈ మూవీ క్లైమాక్స్‌లోనూ భారీగా ఉండే ఎమ్61 వల్కన్ మెషీన్ గన్‌తో ప్రత్యర్థల మీదకి దూసుకెళ్తూ చెమటలు పట్టిస్తాడు. అప్పటివరకు ఆసక్తిగా సాగే సినిమా ఈ ఒక్క హై అక్టేన్ క్లైమాక్స్‌తో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. దీనికి కూడా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ రాబోతుంది. మల్టీవర్స్ తరహాలో కమల్ ‘విక్రమ్’కు ‘ఖైదీ’కి అదిరిపోయే కనెక్షన్ ఇచ్చారు లోకేష్. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది.
స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా.. ‘ఏజెంట్’గా అదిరిపోయే యాక్షన్ హంగామా రుచి చూపిస్తానంటున్నారు కథానాయకుడు అఖిల్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే విడుదలై టీజర్ పోస్టర్స్ చూస్తే ఇందులో ఆయన స్టైలిష్‌గా అదిరిపోయే మెషిన్ గన్స్ చేతులో పట్టుకుని కనిపించారు. అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రమిది.సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
‘కేజీయఫ్ 2’తో యశ్‌ను పూర్తి స్థాయి పాన్ ఇండియా హీరోగా చూపించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు తమ హీరోను ఎలా చూపిస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సలార్’. శ్రుతిహాసన్ కథానాయిక. బొగ్గు గనుల నేపథ్యంలో పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగనుంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఓ లోయలో జరుగుతుందట. అండర్ గ్రౌండ్‌లో తెరకెక్కే ఆ సన్నివేశాలు తెరపై చూస్తుంటే ఒళ్లు గగురుపొడిచేలా ఉంటాయని అంటున్నారు. అంతేకాదు, లోయలో ఛేజింగ్ సన్నివేశాలు కూడా అదరగొట్టేస్తాయని చెబుతున్నారు. మరోవైపు ప్రభాస్ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం సైతం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయిలో సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీలో ప్రభాస్ చేతికి ప్రశాంత్ ఎలాంటి ఆయుధం ఇస్తారో చూడాలి..