తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ ఓటుకు నోటు పై చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రస్తుత రోజులలో వ్యవస్థ మొత్తం చాలా కమర్షియల్ గా మారిపోయిందని.. ఎన్నికలకు ముందు డబ్బులు పంచిన వాళ్లకే కొంతమంది ఓట్లు వేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు.. ఒక ఓటుకి నోటు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నాడు అంటే ఇక ఆ వ్యక్తి అక్రమంగా ఎంత వెనకేసుకొని ఉంటాడో అర్థం చేసుకోవచ్చని కూడా అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే విజయ్ పీపుల్స్ మూమెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలలో 10, 12 తరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన విజయ్ విద్యార్థులకు ఓటు యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. అంతేకాదు ఓటుకు నోటు పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులను సూచించారు. చెన్నైలోని నీలంగరై లో ఒక ప్రైవేటు మాన్ పదమ్ లో జరిగిన ఈ వేడుకలలో విద్యార్థులకు స్కాలర్షిప్ లతో సహా బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా 12వ తరగతిలో 600 కి 600 మార్కులు సాధించిన దిండిగల్ విద్యార్థిని నందినికి విజయ్ ప్రత్యేకంగా డైమండ్ నెక్లెస్ ను అందజేశారు.
అంతే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి విద్యార్థి కూడా తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఇకనుంచి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి అని.. అందుకు తగ్గట్టుగా వారిని తయారు చేయాలని విద్యార్థులకు విజయ్ సూచించడం జరిగింది.. మరికొన్ని సంవత్సరాలలో భవిష్యత్తు నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత నీదేనంటూ కూడా ఆయన మాట్లాడారు. విజయ్ మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తుంటే ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది.