జల్ పల్లి లో సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదులతో ఇంటి రచ్చ కాస్త వీధికెక్కింది. తనకు ప్రాణహాని ఉందని, గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో మంచు ఫ్యామిలీ గొడవ పోలీస్ స్టేషన్ కి చేరింది. జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కి రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో సీపీ ఈ నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తన జల్ పల్లి నివాసం నుంచి రాచకొండ సిపి కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న జెల్ పల్లి లో జరిగిన ఘటనపై మంచు మనోజ్ ని రాచకొండ సిపి విచారణ చేపడుతున్నారు. నోటీసుల నేపథ్యంలో సిపి సుధీర్ బాబు ముందు హాజరయ్యారు మంచు మనోజ్. ఈ ఘటనలో ఇప్పటికే మోహన్ బాబు, మంచు విష్ణు లకు వేరువేరుగా నోటీసులు జారీ చేశారు సిపి. అయితే మోహన్ బాబు, విష్ణు హాజరుపై సస్పెన్స్ నెలకొంది.