అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. ట్రైలర్ రిలీజ్ కాగానే ఎగబడి చూసేశారు. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కానుండగా.. ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి కేవలం 24 గంటలు కూడా కాకముందే పది కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 ట్రైలర్ పై సినీ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
బీహార్ లో జరిగిన ట్రైలర్ ఈవెంట్ సైతం సినీ ఇండస్ట్రీని షేక్ చేసిందని కొనియాడుతున్నారు. తాజాగా హీరోను, మేకర్స్ ను అభినందిస్తూ బన్నీ స్నేహితుడు, వైసీపీ నేత శిల్పా రవి ట్వీట్ చేశారు. దీనికి బన్నీ స్పందిస్తూ.. ‘నీ ప్రేమకు ధన్యవాదాలు బ్రదర్’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు ఏపీలో జరిగిన ఎన్నికల్లో శిల్ప రవి వైసీపీ తరుపున పోటీ చేస్తే.. అల్లు అర్జున్ అతనికి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.