సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని తెలంగాణ సిపిఐ కార్యదర్శి కే రామకృష్ణ పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వైద్యులు రామకృష్ణకు తెలిపారు. అనంతరం ఆసుపత్రి బయట రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలను పెంచుతూ, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇస్తూ జీవోలు ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు. దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు రామకృష్ణ. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారి ఫౌండేషన్ ద్వారా శ్రీ తేజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. కొంతమంది నటులు సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు రామకృష్ణ. వారి తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.