హిందూ పురాణాల ప్రకారం దాక్షాయణి లేదా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయని చెబుతారు. ఇలా ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాల్లో ఒకటి గుజరాత్ లో కూడా ఉంది. అదే అంబాజీమఠ ఆలయం. దక్షయాగం సందర్భంగా దక్షాయని అవమానం పొంది ఆత్మహుతి చేసుకొంటుంది. భార్య వియోగం భరించలేని ఆ పరమశివుడు ఆమె శరీరాన్ని భుజం పై వేసుకొని ప్రళయ తాండం చేస్తాడు.
లయకారకుడైన శివుడు తన కర్తవ్యాన్ని మరిచి ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే పరిస్థితి అదుపుతప్పతోందని భావించిన విష్ణుమూర్తి పరాశక్తి అదేశాలను అనుసరించి ఆమె శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఈ సందర్భంగా దాక్షాయని శరీరం 51 భాగాలుగా విడిపోతుంది. అందులో హృదయం పడిన చోటే ప్రస్తుతం అంబాజీ మాత దేవాలయం వెలిసిందని చెబుతారు. ఇక్కడి ఆలయాన్ని నిర్మించి దాదాపు 1500 ఏళ్లు అవుతుందని చెబుతారు.
ఇక ఇక్కడ అమ్మవారికి ఆలయం అయితే ఉందికాని విగ్రహం ఉండదు. అదేవిధంగా కళ్లకు తెల్లని వస్త్రాలను చుట్టుకొని లేదా కళ్లను మూసుకొని అమ్మారికి భక్తితో నమస్కరించాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా జరిగితే అష్టకష్టాల పాలవుతారని స్థానికులు చాలా కాలంగా నమ్ముతున్నారు. హృదయం అంటే మనిషి ఆలోచనలకు, అనుభూతులకు ప్రతిక అని చెబుతారు. అలోచనలకు, అనుభూతులకు ఆకారం ఉండదు.
అందువల్లే ఇక్కడ దేవతకు ఎటువంటి రూపం ఉండదని దీంతో అమ్మవారికి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయదు. విగ్రహం బదులుగా బీజాక్షరాలు రాసిన ఒక యంత్రం మాత్రం ఇక్కడ పూజలు అందుకొంటూ ఉంటుంది. దీనిని కూడా భక్తులు నేరుగా చూడటానికి వీలులేదు. తెల్లటి వస్త్రంతో కళ్లను కప్పుకొని ఆ దేవతను దర్శించుకోవాల్సి ఉంటుంది. చాలా ఏళ్లుగా ఇదే ఆచారాన్ని ఇక్కడ పాటిస్తున్నారు.