అష్టాదశ శక్తిపీఠాలలో సరస్వతి దేవాలయం విశేషాలు ఇవే !

-

శ్రీ శక్తి.. అమ్మ అమ్మలగన్న అమ్మ ఆ శక్తి స్వరూపిణి. ఇచ్ఛా శక్తి, క్రియా శక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి ఆ అమ్మ. అమ్మవారి అష్టాదశ పీఠాల స్తోత్రాన్ని వినేటప్పుడు ‘కాశ్మీరేతు సరస్వతీ’ అని పఠిస్తాం. ఆ శ్రీశక్తి స్వరూపిణి సరస్వతీ దేవి ఆలయం విశేషాలు తెలుసుకుందాం…

 

దక్షయజ్ఞం తరువాత సతీదేవి శరీర భాగాలు భారతదేశమంతటా పడ్డాయనీ, అవే అష్టాదశ శక్తిపీఠాలుగా భాసిలుతున్నాయి. వాటిలో అమ్మవారి కుడిచేయి కశ్మీరంలో పడిందని చెబుతారు. అక్కడ వెలసిన అమ్మవారిని శారదాదేవిగా కొలుస్తారు. ఇలా కాశ్మీరులో వెలసిన అమ్మవారిని దర్శించేందుకు దేశవిదేశాల నుంచి వేల మంది యాత్రికులు వ్యయప్రయాలసను ఓర్చి చేరుకునేవారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన రామానుజాచార్యులు మొదలుకొని, చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ వరకూ ఇక్కడి ఆలయాన్ని దర్శించినట్లు చెబుతారు. ఇక కల్హణుడు వంటి పండితులు రాసిన వందల ఏళ్లనాటి గ్రంథాలలో ఈ కశ్మీర సరస్వతి ప్రస్తావన తప్పకుండా కనిపిస్తుంది. శంకరాచార్యులవారి స్తోత్రాలలోనూ అమ్మవారి స్తుతి వినిపిస్తుంది.

ఎక్కడ ఉంది ?

బారాముల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో నీలం నదీ తీరాన, నీలం లోయలో ఈ సరస్వతీ ఆలయం ఉంది. శారదా, నారది అనే రెండు పర్వత శిఖరాలు ఈ ఆలయంలోని అమ్మవారికి తలవంచుతున్నట్లుగా కనిపిస్తాయి. దాంతో ఇటు భక్తులతో పాటుగా అటు ప్రకృతి కూడా అమ్మని కొలుచుకుంటున్నట్లుగా తోస్తుంది. ఒకప్పుడు ఈ ఆలయనికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. శారదా దేవి అంటేనే జ్ఞానానికి అధిపతి కాబట్టి, ఆ అమ్మ చెంతనే ఉండి వేదాధ్యయనం చేసేందుకు పండితులు ఉత్సాహపడేవారు. అలా ఇక్కడ వేదాధ్యయనం చేసేందుకు ఏకంగా ఒక విశ్వవిద్యాలయమే ఉండేది. ఆ విశ్వవిద్యాలయం పేరు మీదుగానే ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి శారదా పీఠం అన్న పేరు స్థిరపడిపోయింది. ఇక్కడికి జ్ఞానార్థులే కాదు గ్రంథ రచయితలు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం శారదా పీఠానికి చేరుకునేవారు. అక్కడ అమ్మవారి విగ్రహం ముందర తమ గ్రంథాలను రాత్రివేళల్లో ఉంచేవారు.

ఉదయం ఆలయం తలుపులు తెరిచేసరికి ఆ విగ్రహం ముందర ఉన్న తాళపత్రాలు కనుక కదలకుండా ఉంటే, వాటి మీద అమ్మవారి అనుగ్రహం ఉన్నదనీ… అలా కాకుండా తాళపత్రాలన్నీ చెల్లాచెదురైపోయి ఉంటే అమ్మవారికి అందులోని సారం తృప్తి కలిగించలేదనీ భావించేవారట. జ్ఞానపరంగా, భక్తిపరంగా శారదాపీఠానికి ఇంత మహత్తు ఉండబట్టే ఒకప్పుడు కాశ్మీరం యావత్తూ ‘శారదాదేశం’గా పిలవబడేది. వేల సంఖ్యలో కాశ్మీరీ పండితులు ఇక్కడ స్థిరనివాసాన్ని ఏర్పరుచుకునేవారు. ఇక్కడ అమ్మవారి పేరు మీదుగా ఏకంగా ‘శారదా లిపి’ అనే లిపిని కనుగొన్నారంటే… ఇక్కడి శారదా అమ్మవారిని ప్రజలు ఎంతగా గౌరవించేవారో తెలుస్తుంది. ఇదంతా పూర్వ చరిత్ర. ప్రస్తుతం ఈ ఆలయం వద్ద శిథిలాలు తప్ప మరేవీ లేవు. వందల ఏళ్లుగా శత్రు రాజుల దాడిలో ఇక్కడి ఆలయం ఇంచుమించుగా ధ్వంసమైపోయింది. స్థానిక రాజులు ఎప్పటికప్పుడు ఆలయాన్ని పునర్నిర్మించేవారు కానీ…. 1948 నాటికి పరిస్థితులు దిగజారిపోయాయి. 1948లో భారత, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ ప్రాంతం పాకిస్తాన్‌ ఆధీనంలోకి వెళ్లిపోయింది.

ఆనాటి నుంచి కూడా పాక్‌ ఆక్రమిత కశ్మీరంలో భాగంగా ఈ ఆలయం మిగిలిపోయింది. ఇక్కడ నివాసం ఉన్న కశ్మీరీ పండితులు తరిమివేయబడ్డారు. మిగిలిన కొద్ది మంది చేతా బలవంతంగా మతం మార్పించేశారు. అసలే శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం 2005లో వచ్చిన భూకంపంతో మరింతగా దెబ్బతినిపోయింది. ప్రస్తుతానికి ఇక్కడ ఒకప్పటి భవనాల తాలూకు మొండిగోడలు మాత్రమే మిగిలాయి. ఇక అమ్మవారి విగ్రహం అయితే ఏనాడో అదృశ్యమయిపోయింది. శివలింగాన్ని తలపించే ఓ ఆరడగుల రాయి మాత్రమే మిగిలింది. ఆలయంలో ఏమున్నా లేకపోయినా ఇక్కడి స్థలమహత్యం కారణంగా శారదాపీఠాన్ని చేరుకునేందుకు భక్తులు ఉత్సాహపడుతూనే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తూ పాకిస్తాన్‌ సైన్యం ఇక్కడికి యాత్రికులను ఎవ్వరినీ అనుమతించడంలేదు. కశ్మీర్‌లోని కొండలపై నుంచి దూరంగా కన్పించే ఆ శిథిల ఆలయ దృశ్యాలను గైడ్‌లు చూపిస్తుంటారు. ఎప్పటికైనా ఈ క్షేత్రం పూర్వవైభవం సాధిస్తుందని ఆశిద్దాం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version