మొగలిపూవు గురించి తెలియని వారు ఉండరు. అద్భుతమైన సువాసు ఇచ్చే పువ్వుల్లో ఇది ఒక్కటి. మత్తు కలిగించే పరిమళం దీని సొంతం. పువ్వు వాడిపోయి వారం రోజులైనా దాని సువాసన మాత్రం అలాగే ఉంటుంది. ఇంతటి అద్భుతమైన ఈ పువ్వు మాత్రం దేవుని పూజకు పనికిరాదు.
ఎందుకు.. అంటారా.. దీనికి ఓ కథ ఉంది. పూర్వం బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులకు ఎవరు గొప్ప అనే అంశంపై వివాదం జరిగిందట. అప్పుడు ఈ లోకాన్ని చుట్టి వచ్చినవారే గొప్ప అని పందెం వేసుకున్నారు. బ్రహ్మ, ఈశ్వరుడు ప్రయాణం ప్రారంభిస్తే.. బ్రహ్మ మాత్రం అక్కడే ఉండి.. లోకం మొత్తం చుట్టి వచ్చానని అబద్దం చెప్పారట. ఇందుకు సాక్ష్యంగా ఈ మొగలిపూవును పెట్టారట.
మొగలిపూవు కూడా అవునని అబద్దపు సాక్ష్యం చెప్పిందట. అప్పుడు విష్ణువు తన దివ్య దృష్టితో వాస్తవం గ్రహించి బ్రహ్మ అబద్దాన్ని గ్రహించి శపించాడట. అప్పటి నుంచి బ్రహ్మ, మొగలిపూవు రెండూ పూజకు నోచుకోలేదు. అయితే ఈ కథతో పాటు మొగలిపూవు పూజకు వద్దని చెప్పేందుకు మరో కారణం కూడా ఉంది.
గుబురుగానూ, పదునైన అంచులతోనూ ఉండే మొగలి పొదలు ఏమంత క్షేమమైన ప్రదేశాలు కావు. పైగా పాములు తమ కుబుసాన్ని విడిచేందుకు మొగలి రేకుల వంటి గరుకైన చెట్లని ఎన్ను కొంటాయి. ముఖ్యంగా మన దేశంలో కనిపించే రక్తపింజరి అనే విషసర్పం, మొగలి పొదల చుట్టుపక్కల సంచరించేందుకు ఇష్టపడుతుందని శాస్త్రవేత్తలు కూడా నిర్ధరించారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులలో భక్తులు చిక్కుకోకుండా ఉండేందుకు పెద్దలు మొగలి పూలను పూజలకు నిషేధించి ఉంటారని భావిస్తున్నారు.