తిరుమల ఆభరణాల భద్రతకు కొత్త టెక్నాలజీ !

-

ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి అన్నది అందరికీ తెలిసిందే. నిత్యం బంగారు, వెండి, వజ్ర, వైఢూర్యాలతో కూడిన ఆభరణాలు భక్తులు స్వామివారికి సమర్పిస్తుంటారు. ప్రస్తుతం ఆలయంలోని మూల మూర్తి అలంకరణకు 120 రకాల ఆభరణాలు, ఉత్సవ మూర్తుల అలంకరణకు 383 రకాల ఆభరణాలు వాడుతున్నారు. శ్రీవారికి 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో 7 కిరీటాలు ఉన్నట్టు పాత లెక్కలు చెబుతున్నాయి.

ఇవి కాకుండా ఇంకా చాలా ఆభరణాలు స్వామి వారి ఆలయంలో ఉన్నాట్టు తెలుస్తోంది. అయితే తాజాగా వెంకన్న వారి ఆభరణాలకు మరింత భద్రత కల్పించాలని నిర్ణయించింది టీటీడీ ట్రస్టు బోర్డు. అందుకోసం నూతన టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానంలో వెంకన్న ఆభరణాలకు భద్రత కల్పించడంతోపాటు.. పారదర్శక విధానంలో వాటి వివరాలు అందుబాటులో వుంటాయని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆభరణాల వివరాలను పరిశీలించడానికి బార్ కోడ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు అధికారులు. అయితే బార్ కోడ్ విధానంతో ఉపయోగం లేదని.. శ్రీవారి ఆభరణాలకు మరింత భద్రత కల్పించేందుకు కొత్త టెక్నాలజీని వాడబోతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లతో ఆభరణాలను భద్రపరచే యోచనలో టీటీడీ అధికారులున్నారు. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్లతో మరింత భద్రత ఉంటుందంటున్న అధికారులు కొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక త్వరలోనే టీటీడీ బోర్డులో నిర్ణయం తర్వాత ఈ టెక్నాలజీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏ టెక్నాలజీ వచ్చినా స్వామి అభరణాలు ఎల్లప్పుడు ఆయన రక్షణలోనే ఉంటాయనేది సత్యం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version