పూర్వం చ్యవనమహర్షికి మదభావం ఏర్పడింది. ఆ దుష్టభావమే మదాసురునిగా రూపు దిద్దుకుంది. మహర్షిలోని సద్భావనలు కూడా కొన్ని మద రాక్షసుడిలో ఉన్నాయి. వాడు శుక్రాచార్యుని శిష్యుడై దేవిని గూర్చి ఘోరతపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమైంది. వాడు కోరిన వరాలను ఇచ్చింది. దాంతో వాడి మదము మరింత బలపడింది. ఆ మదంతోనే అన్ని లోకాలను జయించాడు. ప్రమదాసురుని కుమార్తె లాలసను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వాని విజృంభణ లోకాలన్నింటికీ బాధాకర మయ్యింది. మదాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు సనత్కుమార మహర్షిని ఉపాయమడిగారు. దాంతో ఆయన మీ బాధలు తీర్చగలిగే శక్తి ఒక్క ఏకదంతుడికి మాత్రమే ఉందంటూ సలహా ఇచ్చి, ఏకదంత గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు.
అదే సమయంలో గణాధిపతితో యుద్ధానికి దిగిన మూషికాసురుడు మదాసురుని సహాయం కోరాడు. మదానురుడు. వికటాట్టహాసం చేస్తూ గణాధిపతితో యుద్ధానికి దిగాడు. సింహవాహనాన్ని అధిరోహించిన ఏకదంతుడు. వాడితో పోరుకు సై అన్నాడు. అంతలోనే గణేశుడి వాహనమైన సింహం మదాసురుని పైకి లంఘించి వాని గొంతును నోటితో అదిమి పట్టుకుంది. ఏకదంతుడు తన పాదాన్ని వాడిగుండెల పై ఆనించాడు. అంతే, ఏకదంతుడి పాదస్పర్శతో ఆ రాక్షసుడి మదం అణిగింది. వాడు వినాయకుని శరణు వేడాడు. గణాధిపతి మదాసురునికి అభయమిచ్చి ఎన్నడూ ధర్మమునకు భంగం కలిగించవద్దని హెచ్చరించి పాతాళమున నివసించుమని ఆదేశించాడు. కాబట్టి వినాయకుడి పై భక్తి శ్రద్ధలు కలవారు మదమునకు అవకాశం ఇవ్వకూడదు. మదాసురుని ఆహ్వానించని వారికే గణపతి అనుగ్రహం చేకూరుతుంది. ఈ నాటి పూజతోక శక్తి గణపతి అనుగ్రహించి, బలహీనతలను రూపుమాపి శక్తిమంతులుగా తీర్చిదిద్దుతాడు.
విఘ్నేశ్వరుని నామాలలో “స్థూలకాయుదు” అని చెప్పబడింది. అతడు చిన్న బిడ్డ. బిడ్డలు స్థూలంగా వుంటేనే ముద్దుగా వుంటారు. గణేశుని తల విఘ్నాలను తొలగించేది. చిన్న కండ్లు, సూక్ష్మ దృష్టిని సూచిస్తుంది. ఏనుగు లాంటి తొండము స్వాభిమానాన్ని తెలుపుతుంది. పెద్ద చెవులు ప్రతీచిన్న విషయాన్ని సమానంగా వినాలి. దంతాలు ఎవరికి ఏ విధమైన హాని చేయరాదు. నాలుకతో ఆ పరిశీలనకు, పెద్ద ఉదరము జ్ఞానాన్ని జీర్ణించుకుందుకు చిహ్నాలు. నాలుగు చేతులు, ధర్మ, అర్ధ, కామ, మోక్షము సాధించుటకు మార్గాలు.