ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్.. ఐఫోన్ సిరీస్‌లో నూతన మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఈవెంట్‌లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ ఫోన్లను లాంచ్ చేశారు.
ఐఫోన్ 13 ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. గత మోడల్స్ కన్నా మరింత వేగంగా పనిచేసేలా ఈ ఫోన్లను తీర్చిదిద్దారు. వీటిల్లో యాపిల్ ఎ15 బయానిక్ చిప్‌సెట్ లభిస్తుంది. ఇందులో 6 కోర్స్ ఉంటాయి. అందువల్ల గత మోడల్స్ కన్నా ఫోన్లు వేగంగా పనిచేస్తాయి.
ఐఫోన్ 13, 13 మినీ ఫోన్లలో ఐఓఎస్ 15 ఓఎస్‌ను అందించనున్నారు. డిస్‌ప్లేను ఓలెడ్ తరహాలో తీర్చిదిద్దారు. గత మోడల్స్ కన్నా అద్భుతమైన డిస్‌ప్లే క్వాలిటీ లభిస్తుంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి. ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తుంది. డిస్‌ప్లేపై నూతనంగా సెరామిక్ షీల్డ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల డిస్‌ప్లే ఎట్టి పరిస్థితిలోనూ పగలదు.
కొత్త ఐఫోన్లు పింక్, బ్లూ, మిడ్‌నైట్, స్టార్ లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్ ఆప్షన్లలో విడుదలయ్యాయి. వీడియోలను, ఫొటోలను తీసుకునేందుకు వీలుగా ఈ ఫోన్లలో వెనుక వైపు 12 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో అద్భుతమైన ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు.
కొత్తగా ఈ ఫోన్లలో సినిమాటిక్ మోడ్‌ను అందిస్తున్నారు. దీంతో సినిమాల్లోలాగా షాట్స్‌ను తీసుకోవచ్చు. వీడియోలు తీసే సమయంలో ఫోకస్ ఆటోమేటిగ్గా షిఫ్ట్ అవుతుంది. దీంతో సినిమాటిక్ షాట్స్ వస్తాయి. అందువల్ల ఈ ఐఫోన్లతో ఏకంగా సినిమాలను అలవోకగా తీయవచ్చు. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ కు వీటిలో సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫొటోలు, వీడియోలు అద్భుతమైన క్వాలిటీతో వస్తాయి. తక్కువ కాంతిలోనూ పవర్ ఫుల్ ఫొటోలు, వీడియోలను తీయవచ్చు.
గత మోడల్స్‌లాగే ఐఫోన్ 13 మోడల్స్ లోనూ 5జి లభిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే గత ఫోన్ల కన్నా ఇవి 1.50 నుంచి 2.50 గంటల వరకు అదనపు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. గత ఫోన్ల కన్నా కొత్త ఐఫోన్లలో అదనపు ప్రైవసీ ఆప్షన్లను, సెక్యూరిటీని అందిస్తున్నారు. ఐఫోన్ 13 మినీ ధర 699 డాలర్లు ఉండగా, ఐఫోన్ 13 ధర 799 డాలర్లుగా ఉంది. ఇవి 128, 256, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభ్యం కానున్నాయి.
ఇక ఐఫోన్ 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్‌లలో 6.1, 6.7 ఇంచుల డిస్‌ప్లేలను అందిస్తున్నారు. అలాగే వెనుక వైపు 3 కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి ఐఫోన్ 13, 13 మినీ కన్నా అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగానే లభిస్తుంది. ఈ ఫోన్లను 128, 256, 512 జీబీతోపాటు 1టీబీ ఆప్షన్‌లోనూ అందిస్తున్నారు. ఇక ఐఫోన్ 13 ప్రొ ప్రారంభ ధర 999 డాలర్లు ఉండగా, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ ప్రారంభ ధర 1099 డాలర్లుగా ఉంది. ఈ ఫోన్లను సెప్టెంబర్ 24వ తేదీ నుంచి విక్రయిస్తారు.
కాగా ఈ ఈవెంట్‌లో యాపిల్ నూతన జనరేషన్ ఐప్యాడ్, ఐప్యాడ్ మినీ, వాచ్ సిరీస్ 7 డివైస్ లను కూడా లాంచ్ చేసింది.