తిరుపతి వెంకటేశ్వరస్వామి ఎందుకు కళ్లు మూసుకునే ఉంటాడు..? ఆ ఒక్కరోజే దర్శనభాగ్యం

-

తిరుమల తిరుపతి దేవస్థానం..జీవితంలో ప్రతి ఒక్కరు తప్పక దర్శించాల్సిన ఆలయం ఇది. చాలా మంది ఏటా వెళ్తుంటారు. కాలినడక వెళ్తుంటే ఇంకా బాగుంటుంది. మీ అందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. ఎంతో కష్టపడి అన్ని మెట్లు ఎక్కి, గంటల తరబడి నిరీక్షించి చివరికి ఆ దేవదేవుడి దర్శనం కోసం వెండివాకిలి దాటగానే.. మనసులో ఏదో తెలియని సంతోషం, గుండెల మీద ఉన్న బరువు అంతా ఒక్కసారిగా దిగిన అనుభూతి.. అలా బంగారు వాకిలిలోకి ఎంటర్‌ అవగానే.. వైబ్రేషన్స్‌ వస్తాయి.. చల్లటి గాలి మనల్ను తాకుతుంది.. గోవిందా అనే నామాన్ని ఊపిరిబిగబట్టి గట్టిగా అరుస్తూ..  ఆ వెంకటేశ్వరుడిని దర్శించుకుంటే తెలియకుండానే కళ్లల్లో నీళ్లు వచ్చేస్తాయి. గట్టిగా పది సెకన్లు కూడా ఆ దేవుడిని చూడం అయినా సరే.. ఎంతో సంతోషం.  కానీ మీరు గమనించారా..? వెంకటేశ్వర స్వామి కళ్లు ఎప్పుడు మూసే ఉంటాయి.. ఏ దేవుడి విగ్రహం చూసినా కళ్లు తెరిచి ఉంటాయి.. కానీ ఎందుకు తిరుపతి వెంకన్న కళ్లు మూసుకున్నాడు..? ఈ ప్రశ్నకు సమాధానం ఇదిగో..!!
మత విశ్వాసాల ప్రకారం.. కలియుగంలో తిరుపతి ఆలయంలో వేంకటేశ్వరుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. వేంకటేశ్వరుడు తన ప్రకాశవంతమైన మరియు శక్తివంతమైన కళ్ళకు ప్రసిద్ధి చెందాడు. వేంకటేశ్వరుని కళ్లలోని విశ్వశక్తి వల్ల భక్తులు నేరుగా ఆయన కళ్లలోకి చూడలేరు. అందుకే వేంకటేశ్వరుని కళ్ళు తెల్లటి ముసుగుతో కప్పబడి ఉంటాయి. అదే గోవింద నామం. ఈ నామం గురువారం మాత్రమే మార్చబడుతుంది, కాబట్టి భక్తులు ఈ సమయంలో  వెంకన్న కళ్ళను చూడగలరు. గురువారం స్వామి వారి నిజరూప దర్శనం ఇస్తాడు. అప్పుడు ఎలాంటి అలంకరణ లేకుండా సాధారణంగా ఉంటారు.
గురువారం వేంకటేశ్వరునికి చందన స్నానం చేస్తారు. విగ్రహానికి చందనం పూస్తారు. శ్రీ వేంకటేశ్వరుని హృదయంపై చందనాన్ని పూయడం ద్వారా సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్వరూపం కనిపిస్తుందని చెబుతారు. వారంలో ఆరు రోజులు వివిధ రకాల నగలు, అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజ రూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది.  ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత శ్రీవారి మూల విరాట్టుని ఎటువంటి అలంకారాలు, ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా నిజ సరూపంతో భక్తులకు దర్శనమిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version