ఎడిట్ నోట్: ‘బీసీ’ ఛాంపియన్స్.!

-

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అందరికీ బీసీలు గుర్తొచ్చేస్తారు. ఇంకా బీసీల జపం చేసేస్తారు. వారి ఓట్లని కొల్లగొట్టడానికి రకరకాల ఎత్తుగడలతో ముందుకొస్తారు.  అబ్బో బీసీలకు తామే ఎక్కువ చేశామని, తామే బీసీ ఛాంపియన్స్ అని డప్పు కొట్టేసుకుంటారు. మళ్ళీ బీసీల ఓట్లు దక్కించుకునే వరకు అలాంటి ఎత్తుగడలు ఆపరు. ఇప్పుడు ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు బీసీ జపం మొదలుపెట్టారు. బీసీల ఓట్లని ఆకర్షించడానికి..బీసీలతో సమావేశాలు, సభలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

ఇలా బీసీల జపం చేయడానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రంలో బీసీల ఓట్లు ఎక్కువ. వారే గెలుపోటములని డిసైడ్ చేస్తారు. బీసీలు ఎటువైపు ఎక్కువ మొగ్గుచూపితే వారి గెలుపు ఈజీ. గత ఎన్నికల్లో బీసీలు మెజారిటీ సంఖ్యలో వైసీపీ వైపు మొగ్గుచూపారు. దీంతో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది. ఈ సారి కూడా బీసీల ఓట్లని ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అబ్బో తమ పాలనలో బీసీలకు చాలా చేసేశామని, అసలు బీసీలకు న్యాయం చేసింది జగన్ అని చెప్పి వైసీపీ నేతలు డప్పు కొట్టేస్తున్నారు.

అటు టీడీపీ నేతలు కూడా రివర్స్ లో అదే చేస్తున్నారు. అసలు బీసీల పార్టీ టీడీపీ అని, అప్పుడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు..బీసీలకు న్యాయం చేశారని, బీసీలకు అన్నీ రకాలుగా ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ జయహో బీసీ సభ పెట్టడానికి రెడీ అయింది. నేడు విజయవాడలో సభ జరగనుంది. ఈ సభకు ధీటుగా టీడీపీ సైతం బీసీల అంశంపై రాజకీయం బాగానే చేస్తున్నారు.

వరుసపెట్టి టీడీపీలోని బీసీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ..బీసీలకు టీడీపీ న్యాయం చేస్తే, వైసీపీ అన్యాయం చేసిందన్నట్లు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళిన చంద్రబాబు..బీసీలతో సెపరేట్ గా సమావేశం అయ్యారు. అలాగే 10వ తేదీన బాపట్లలో కూడా బీసీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇలా ఎవరికి వారు బీసీల ఓట్ల కోసం ఎత్తులు వేస్తున్నారు. అంటే రెండు పార్టీల రాజకీయం ఎలా ఉందంటే..అంతకముందు బీసీలు వెనుకబడి ఉంటే..తామే ముందుకు తీసుకొచ్చామనే విధంగా డప్పు కొడుతున్నారు.

అయితే రాజకీయంగా బీసీలు ఎప్పుడు కీలకపాత్ర ఉంటుంది. వారి దెబ్బకు ప్రభుత్వాలు మారిపోతాయి. గత ఎన్నికల్లో వారు వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఈ సారి ఆ స్థాయిలో వైసీపీ వైపు వెళ్ళడం కష్టమే అని తెలుస్తోంది. మరి ఈ సారి బీసీలు ఎటువైపు వెళ్తారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version