ఏపీ రైతులకు శుభవార్త… ఇప్పటి వరకూ రాష్ట్రంలో 418.75 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలులో ఇప్పటి వరకూ 391:50 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. 24 గంటల్లోపు 281.30 కోట్లు రైతులు ఖాతాలో జమ అయ్యాయన్నారు. 24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేసిన నగదు 10.20 కోట్లు అని వివరించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
ధాన్యం విక్రయించిన 24 గంటల్లో నగదు జమ చేస్తున్నట్లు వివరించారు. ధాన్యం అమ్మిన రైతు ఖాతాల్లో 24 నుంచీ 48 గంటల్లో నగదు జమ చేసే విధానం అమలులోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం అని గుర్తు చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 617 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 24051 మంది రైతుల నుంచి 1,81,988 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటించారు.
ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా వాట్సాప్ చాట్‌బోర్డ్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా ప్రత్యేక వాయిస్ సేవలు తీసుకొచ్చినట్లు తెలిపారు. గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలు సులభతరం చేసినట్లు పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.