ఫస్ట్ కాజ్ : ఇ లెర్నింగ్ ప్రాసెస్-ను మరింత ఉద్ధృతం చేయడం ఏపీ సర్కారు ఇప్పుడు నిర్ణయించుకున్న విధానం.
మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా నాణ్యమయిన విద్యను అందించాలన్న ధ్యేయంతో ప్రస్తుత వైసీపీ సర్కారు పనిచేసేందుకు సిద్ధం అవుతోంది. ఆర్థికంగా భారం అయినా కూడా కొన్ని వినూత్న పథకాల అమలు, సంబంధిత నిధుల కేటాయింపు కూడా వద్దనుకోవడం లేదు. గతం కన్నా వేగంగా ఈ ఏడాది మంచి సౌకర్యాలు అందించేందుకు, విద్యా సంవత్సరానికి ముందే జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే డిజిటల్ క్లాస్ రూమ్స్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం త్వరలో విద్యార్థులకు శుభవార్త వినిపించనుంది. ఇప్పటికే అమ్మ ఒడి వద్దనుకునే విద్యార్థులకు (తొమ్మిది నుంచి ఇంటర్ వరకూ) డబ్బులు బదులు ల్యాప్ టాప్ లు అందిస్తున్నారు. ఇదే సమయాన ఇప్పుడు మరో పద్ధతిని ఎంపిక చేశారు. దీని ద్వారా ఎనిమిదో తరగతి విద్యార్థికి ట్యాబ్ అందించి ఆన్ లైన్ లెర్నింగ్ ను డెవలప్ చేయడంతో పాటు ఇంగ్లీషు లాంగ్వేజ్ స్కిల్స్ ను కూడా పెంపొందించేందుకు చర్యలు చేపట్టున్నారు సంబంధిత అధికారులు. ఆ వివరం ఈ కథనంలో..
ఆంధ్రావనిలో విద్యకు సంబంధించి కొన్ని మార్పులు ఆచరణీయం చేసేందుకు యువ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏటా వివిధ పథకాల ద్వారా డ్రాపౌట్లను తగ్గించడమే కాకుండా, నాణ్యమైన విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు ఉంటేనే ప్రభుత్వ బడులపై శ్రద్ధ పెరుగుతోంది. అందుకే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పలు బడులకు కొత్త హంగులు చేకూరాయి.
మొదటి విడత పూర్తవ్వడంతో రెండో విడతకు జగన్ సిద్ధం అవుతున్నారు. ఇదే విధంగా అమ్మఒడి, జనగన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక లాంటి పథకాలు కూడా అమలు అవుతున్నాయి. విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ఈ ఏడాది నుంచి మరో వినూత్న పథకానికి శ్రీకారం దిద్దుతున్నారు.
ఎనిమిదో తరగతి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందుబాటులో తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ట్యాబ్ లు అందించనున్నారు. బై జూస్ కంపెనీతో ఇప్పటికే టై అప్ అయ్యారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ ఎనిమిదో తరగతి నుంచి అందుబాటులో రానున్నందున విద్యార్థులకు మేలైన మరియు మెరుగైన చదువు అందే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఎనిమిదో తరగతికి వచ్చే పిల్లలకు అంటే నాలుగు లక్షల 70 వేల మంది విద్యార్థులకు ఈ సౌకర్యం అందనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. త్వరలో వీరికి ఇ – లెర్నింగ్ అన్నది అందుబాటులోకి రానుంది.