కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలకూ ప్రస్తుతం తీవ్రమైన నష్టం కలుగుతోంది. ముఖ్యంగా విమానయాన రంగంపై కరోనా ప్రభావం బాగానే పడింది. అయితే లాక్‌డౌన్ ఎత్తేశాక.. కరోనా ప్రభావం తగ్గినా.. ఇప్పుడప్పుడే విమాన సర్వీసులు మళ్లీ యథావిధిగా నడిచే అవకాశం లేకపోవడంతో.. ఈ రంగానికి భారీ ఎత్తున నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత విమానయాన రంగంలో కొన్ని లక్షల వరకు ఉద్యోగాలకు కోత పడే అవకాశం ఉందని వారంటున్నారు.
ఐఏటీఏ (International Air Transport Association) అసియా పసిఫిక్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ కొన్రాడ్ క్లిఫోర్డ్ చెబుతున్న ప్రకారం.. కేవలం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే విమానయాన రంగంలో 1.12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ఇక భారత్‌లో 29, 32, 900 మంది ఉద్యోగాలు పోతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు కల్పించుకుని విమానయాన రంగాలను ఆదుకోవాలని.. లేదంటే ముందు ముందు మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని అన్నారు.
ఇక 2019తో పోలిస్తే ఈ ఏడాది మన దేశ విమానయాన రంగం 11,221 మిలియన్ డాలర్లను నష్టపోతుందని, విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 47 శాతానికి పడిపోతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఈ రంగాన్ని ఆదుకునేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని అంటున్నారు. మరి ముందు ముందు ప్రభుత్వాలు ఈ రంగం కోసం ఎలాంటి ఆర్థిక ప్యాకేజీలను ప్రకటిస్తాయో చూడాలి..!