జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగే.. న్యూస్‌.. త‌ర్వాత కూడా ఇలానే రాస్తారా…?

-

ఏపీలో జ‌గ‌న్ పాల‌న ప్రారంభించి నాలుగు మాసాలు గ‌డుస్తోంది. అయితే, ఆయ‌న పాల‌న‌లో ఎగుడు దిగుడు లు, లోపాలు కామ‌న్‌గానే ప్ర‌తిప‌క్షాల క‌ళ్ల‌కు క‌నిపిస్తాయి. అదేస‌మ‌యంలో సంక్షేమం, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, నిధుల వినియోగం, పొదుపు, రూపాయి జీతానికే సీఎం సేవ‌లు అందించ‌డం, అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉండ‌డం వంటివి ప్ర‌భుత్వ ప‌క్షానికి, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు క‌నిపిస్తాయి. ఈ విష‌యంలో ఎవ‌రి గోల‌వారిదే. అయితే, ఈ రెండింటికీ మ‌ధ్య మీడియా పాత్ర కూడా కీల‌కంగా మారింది. త‌న‌కు అన‌కూలంగా ఉన్న ప్ర‌భుత్వంపై అవ్యాజ‌మైన ప్రేమ‌ను కురిపించే ఓ మీడియా.. వ్య‌తిరేక స‌ర్కారుపై నిప్పులు కురిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఈ నాలుగు నెల్ల‌లో.. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఉన్న ఓ ద‌మ్మున్న ప‌త్రిక‌.. ప్ర‌భుత్వం అనే కోడిగుడ్డుపై వ్య‌తిరేక‌త అనే ఈక‌లు లాగ‌డం చేస్తోంది. ఇటీవ‌ల స‌చివాలయ ఉద్యోగాల‌కు సంబంధించిన ప‌శ్న ప‌త్రం లీకైందంటూ.. హ‌డావుడి చేసింది. పుంఖాను పుంఖాలుగా క‌థ‌నాలు వండి వార్చింది. అయితే, వీటిలో ప‌స‌లేద‌ని తెలియ‌డంతో ప్ర‌భుత్వం నుంచి ఎక్క‌డ క‌న్నెర్ర ఎదుర్కొనాల్సి వ‌స్తుందోన‌ని ఒకింత వెన‌క్కి త‌గ్గింది. ఇక‌, ఇసుక దందా అంటూ.. కొన్ని రోజులు చేతులు కాల్చుకున్నా..అందులోనూ ప్ర‌భుత్వాన్ని త‌ప్పు ప‌ట్టే ప‌రిస్థితి లేక పోవ‌డం స‌ర్దుకు పోయింది. ఇక‌, పోల‌వ‌రం రీటెండ‌ర్ల‌పై ఈ ప‌త్రిక రాసిన‌న్ని క‌థ‌నాలు మ‌రెవ‌రూ రాయ‌లేదు.

అయితే, రివ‌ర్స్ టెండ‌ర్ల‌లో ప్ర‌భుత్వం ఆదాచేసే స‌రికి కిమ్మ‌న‌కుండా ఉండిపోయింది. ఇక ఇప్పుడు ఆలూ లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్టుగా ఏపీ సీఎం జ‌గ‌న్ కు సంబంధించిన కేసుల విచార‌ణ‌కు సంబంధించిన వార్త‌ను ఒక‌దాన్ని హైలెట్ చేసి రాక్ష‌సానందం పొందింది. ప్ర‌స్తుతం మేదావి వ‌ర్గాల్లో ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీని ఎడం కాలితో త‌న్ని బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న స‌త్తా నిరూపించుకునేందుకు పార్టీ పెట్టి, స‌క్సెస్ అయి న జ‌గ‌న్‌పై కొంద‌రు రాజ‌కీయ శ‌త్రువులు కాంగ్రెస్‌తో చేతులు క‌లిపి ఆయ‌న‌పై కేసులు బ‌నాయించారు. వీటికి సంబంధించి కోర్టుల్లో విచార‌ణ సాగుతోంది.

అయితే, ప్ర‌స్తుతం తాను సీఎంగా ఉన్నాన‌ని, విచార‌ణ‌కు స్వ‌యంగా రాలేన‌ని, కాబ‌ట్టి త‌న లాయ‌ర్‌ను పంపుతాన‌ని సీఎంగా ఉన్న జ‌గ‌న్ కోర్టులో అప్పీలు దాఖ‌లు చేశారు. దీనికి సంబంధించిన వాద‌న‌లు ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే సీబీఐ అధికారులు త‌మ వాద‌న‌ను కోర్టుకు వెల్ల‌డించారు. అయితే, వీరి వాద‌న‌లే తీర్పు అన్న‌ట్టుగా ఈ ద‌మ్మున్న ప‌త్రిక హైలెట్ చేస్తూ.. “జ‌గ‌న్ కోర్టుకు రావాల్సిందే!“ అంటూ ఓ పెద్ద క‌థ‌నం అల్లేసింది.

ఈ హెడ్డింగును చూస్తే.. ఇంకేముంది .. జ‌గ‌న్ జైలు ప‌క్షే అని అనిపించేలా ఈ ప‌త్రిక పెద్ద వ్యూహమే ప‌న్నింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విమ‌ర్శించేందుకు ఏమీ లేని స‌మ‌యంలో ఇలాంటి కుళ్లు వార్త‌లు రాయ‌డం ద్వారా త‌న ప‌త్రిక విశ్వాసాన్ని తానే త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ రేపు.. వాద‌న‌లు పూర్త‌యి.. జ‌గ‌న్ సీఎంగా ఉన్నారు కాబ‌ట్టి.. ఆయ‌న‌కు మిన‌హాయింపు నిస్తున్నాం.. ఆయ‌న త‌ర‌ఫున లాయ‌ర్ కోర్టుకు వ‌స్తే.. చాల‌ని సీబీఐ కోర్టు తీర్పు ఇస్తే.. ఇలా ప్ర‌జంటేష‌న్ చేయ‌గ‌ల‌దా ఈ ప‌త్రిక? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version